Begin typing your search above and press return to search.

కేరళలో తీవ్ర చర్చగా మారిన విష్ణుజా ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటకు!

కేరళకు చెందిన పాతికేళ్ల విష్ణుజా ఆత్మహత్య ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 4:20 AM GMT
కేరళలో తీవ్ర చర్చగా మారిన విష్ణుజా ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటకు!
X

కేరళకు చెందిన పాతికేళ్ల విష్ణుజా ఆత్మహత్య ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భర్త సూటిపోటి మాటలు అంటున్నా.. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నా.. మౌనంగా అన్నీ భరించిందే తప్పించి కన్నవారికి కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. అంతేనా.. ఎప్పటికైనా భర్త మారతాడని.. అతడితో తన జీవితం బాగుంటుందన్న ఆశతో బతికిన ఆమె.. చివరకు భర్త పెట్టే చిత్రహింసలకు తాళలేక ఆత్మహత్య (?) చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. అయితే.. ఆమె మరణాన్నిఅనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ క్రమంలో పలు షాకింగ్ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మలప్పురం ప్రాంతానికి చెందిన విష్ణుజాకు 2023 మేలో ప్రభిన్ అనే యువకుడితో పెళ్లైంది. ఈ జంట ఎలంగూర్ లో కాపురం పెట్టారు. ఒక పేరు మోసిన కార్పొరేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న ప్రభిన్.. భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఇదిలా ఉండగా.. జనవరి 31న ఉదయం భార్యభర్తల మధ్య గొడవ జరగటం.. కాసేపటికే ప్రభిన్ ఇంట్లో నుంచి ఆవేశంగా వెళ్లిపోవటం.. విష్ణుజా పై నుంచి కిందకు రాకపోవటంతో పక్క పోర్షన్ లో ఉండే వారి సాయంతో తలుపు బద్దలు కొట్టించి చూడగా.. ఆమె అప్పటికే ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు.

ఈ కేసు విచారణలో భాగంగా వారికి సంబంధించిన పలువురు స్నేహితులతో పోలీసులు విచారణ జరిపారు. ఈ సందర్భంగా భార్యను మానసికంగా.. శారీరకంగా భర్త హింసలు పెట్టేవాడని తేల్చారు. తాను పడుతున్న బాధల్ని తల్లిదండ్రులతో ఎప్పుడూ పంచుకోలేదన్న విషయాన్ని గుర్తించారు. ఉద్యోగం లేదని.. అందంగా ఉండదని తరచూ వేధింపులకు గురి చేసే భర్తను మార్చుకోవాలని అనుకున్నదే తప్పించి.. అతడి మీద ఏ రోజు తన ఇంట్లో వారికి కంప్లైంట్ చేయకపోవటం గమనార్హం.

తనకు ఎదురవుతున్న వేధింపుల్ని స్నేహితులతో పంచుకునేది. ఆమె ఫోన్ మీద నిఘా పెట్టి.. వాట్సాప్ చాట్ చూపించి మరింత వేధింపులకు గురి చేసేవాడు. ప్రతి చర్యను వేలెత్తి చూపించి.. హింసించేవాడు. ఈ క్రమంలో భర్త పెట్టే హింసకు విసిగిపోయిన ఆమె.. చివరకు ఆత్మహత్య చేసుకొని ఉంటుందని చెబుతుంటే.. మరికొందరుమాత్రం భర్తే చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో తనకు ఎదురవుతున్న సమస్యల గురించి తమ కుమార్తె ఏ రోజు చెప్పలేదని.. ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. చదువుకునే రోజుల్లోనే ఇంటి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని జాబ్ చేసి..ఇంటికి ఆర్థికంగా అండగా ఉండేదని.. అలాంటి తమ కుమార్తె తనకుకష్టం ఎదురైనప్పుడు తమతో చెప్పలేదని.. తాము ఆమెకు అండగా నిలవలేకపోయామన్న వేదనను వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.