ముందుకు సాగేకొద్దీ ఆందోళన 107 మంది మృతి ఆ 600 మందీ ఎక్కడ?
ఇంకా పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిధిలాల కింద అసువులు బాసి ఉంటాయని అంటున్నారు.
By: Tupaki Desk | 30 July 2024 1:13 PM GMTకేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఈ ప్రకృతి ప్రకోపం కారణంగా ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకూ 107 మంది మృతిచెందినట్లు రాష్ట్ర రెవిన్యూ ఆఫీస్ వెళ్లడించింది. ఇంకా పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిధిలాల కింద అసువులు బాసి ఉంటాయని అంటున్నారు.
అవును... కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం తీవ్రస్థాయికి చేరినట్లుగా మారిపోయింది పరిస్థితి! ఈ జిల్లాలోని మెప్పాడి, చురల్మల, ముండకై ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఆందోళన కరంగా ఉంది. తొలుత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మండకై ప్రాంతంలో కొందచరియలు విరిగిపడగా.. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లారు.
అక్కద కొంతమంది బాధితులను సమీపంలోని చురల్మల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. అయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆ స్కూల్ సమీపంలో కొండచరియలు పడ్డాయి. దీంతో.. ఆ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరం సహా చుట్టుపక్కల ఇళ్లు, షాపులు అన్నీ బురదలో కొట్టుకుపోయాయి.
ఈ సమయంలో శిధిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఆర్థనాదాలు చేస్తున్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా... ఆర్మీ, ఎన్.డీ.ఆర్.ఎఫ్. సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సమయంలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడినట్లు చెబుతున్నారు.
ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు.. కొండచరియలు విరిగి పడుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆంటంకం ఏర్పడుతుందని అంటున్నారు. మరోపక్క ఈ సహాయక చర్యలు ముందుకుసాగే కొద్దీ ఆందోళనకరమైన విషయాలు వెల్లడవుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా 600 మంది అచూకీ గల్లంతైందనే విషయం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది!
ముండకై ప్రాంతంలో ఉన్న కాఫీ, తేయాకు, యాలకుల తోటల్లో పనిచేసేందుకు వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచి వందల మంది కార్మికులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హారిసన్ మలయాళీ ఫ్లాంటేషన్ లిమిటెడ్ లో పనిచేయడానికి సుమారు 600 మంది వచ్చారంట. వీరంతా ముండకైలీనే నివాసం ఉంటున్నారని చెబుతున్నారు.
ఈ సమయంలో కంపెనీ జీఎం స్పందిస్తూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా తమ కార్మికులతో ఇప్పటివరకూ సంప్రదించలేకపోయినట్లు తెలిపారు.. దీనికి తోడు మొబైల్ నెట్ వర్క్స్ కూడా పనిచేయడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో వరదలో కొట్టుకుపోయినవారి గురించి, ఆచూకీ తెలియకుండా ఉన్నవారి గురించి అన్వేషణ సాగిస్తున్నారు. ఇందులో భాగంగా జాగిలాలు, డ్రోన్ల సాయాన్ని తీసుకున్నారు. ఇదే సమయంలో... నౌకాదళానికి చెందిన 30మంది గజైఇతగాళ్లనూ రప్పించారు. మరోవైపు వయనాడ్ జిల్లాలోని విపత్తు నేపథ్యంలో రాష్ట్రం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.