Begin typing your search above and press return to search.

ఒక్క ఓటు కోసం ఎన్ని కిలోమీటర్లు నడిచారో తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడం బాధ్యతగా భావించాలని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   20 April 2024 8:13 AM GMT
ఒక్క ఓటు కోసం ఎన్ని కిలోమీటర్లు నడిచారో తెలుసా?
X

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడం బాధ్యతగా భావించాలని చెబుతున్నారు. ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. దాన్ని వినియోగించుకోవడమే మనం దానికి ఇస్తున్న విలువ. ఓటు అంటే తేలికగా తీసిపారేసేది కాదు. 18వ సార్వత్రిక ఎన్నికలు నిన్న ప్రారంభమయ్యాయి. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపుతో ముసలివారు ఇంటి నుంచే ఓటు వేసుకునే అవకాశం కల్పించడంతో కేరళలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి పెట్టుకున్న దరఖాస్తుకు ఎన్నికల సిబ్బంది అతడి కోసం వెళ్లారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన. ఓటు హక్కుకు మనం ఇస్తున్న ప్రాధాన్యం అలాంటిది. అతడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి తన ఇంటికే రావాలని తన మనవడి ద్వారా అర్జీ పెట్టుకున్నాడు. దీంతో అతడు విన్నపాన్ని మన్నించిన ప్రభుత్వం 8 మంది సిబ్బందిని పంపించింది. వారంతా అడవిలో ఏకంగా 18 కిలోమీటర్లు నడవడం విశేషం.

కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న ఏకైక గిరిజన పంచాయతీ ఇడమలకుడి. అక్కడ శివలింగం అనే ఓటరున్నాడు. అతడి వయసు 92 ఏళ్లు. వయసు రీత్యా పోలింగ్ కేంద్రానికి రాలేనని ఇంటి నుంచే ఓటు వేస్తానని చెప్పడంతో అధికారులు అతడి కోసం అడవి బాట పట్టారు. దాదాపు ఐదున్నర గంటలు నడిచి గమ్యస్థానం చేరుకుని అతడితో ఓటు వేయించారు.

వారంతా నిన్ననే ప్రయాణం ప్రారంభించారు. మున్నార్ నుంచి బయలుదేరి ఇవరకుళం నేషనల్ పార్కు మీదుగా పెట్టిమూడి చేరుకున్నారు. అక్కడ నుంచి జీపులో కెప్పక్కడ్ చేరుకున్నాక అక్కడ రోడ్డు లేదు. అడవిలో వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లారు. ముగ్గురు మహిళా సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది ప్రయాణం చేశారు. పది గుడిసెలున్న ఇడమలకుడి చేరుకుని అతడితో ఓటు వేయించుకున్నారు.

అతడు మంచం దిగే పరిస్థితి లేదు. అతడి మంచం చుట్టూ కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి మనవడి సాయంతో ఓటు వేయించారు. ఎన్నికల సిబ్బంది అంతదూరం నడిచి అతడితో ఓటు వేయించడం వారి బాధ్యతను గుర్తు చేసింది. ఒక్క ఓటు కోసం అంత దూరం ప్రయాణించడం నిజంగా విశేషం. మనదేశం ఇచ్చిన పిలుపు మేరకే ఇలా అధికారులు ఓటు వేయించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.