Begin typing your search above and press return to search.

కేరళలో అర్థరాత్రి విలయం..100 మందికి పైగా మృతి.. తాజా పరిస్థితి ఇదే!

కేరళలోని వయనాడ్ జిల్లాలో మొప్పాడి సమీపంలో పలు ప్రాంతాల్లో ఈ రోజు (జూలై 30) తెల్లవారుజామున భారీ విలయం సంభవించింది

By:  Tupaki Desk   |   30 July 2024 9:45 AM GMT
కేరళలో అర్థరాత్రి విలయం..100 మందికి పైగా మృతి.. తాజా పరిస్థితి ఇదే!
X

కేరళలోని వయనాడ్ జిల్లాలో మొప్పాడి సమీపంలో పలు ప్రాంతాల్లో ఈ రోజు (జూలై 30) తెల్లవారుజామున భారీ విలయం సంభవించింది. ఇందులో భాగంగా.. భారీ కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ సుమారు 100 మందికి పైగా మృతి చెందినట్లు చెబుతున్నారు! మరోపక్క వందలాదిమంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

అవును... ప్రస్తుతం కేరళలోని పలు ప్రాంతాల్లో దయణీయ పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా ముండకైలో అర్ధరాత్రి ఒంటిగంటకు, ఆ తర్వాత తెల్లారుజామున నాలుగు గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. వీటి వల్ల సుమారు 400కు పైగా కుటుంబాలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియరాలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రెవిన్యూ మంత్రి... విపత్తుపై ఇంకా కచ్చితమైన అంచనాకు రాలేదని చెబుతున్నారు.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. ఇదే సమయంలో... సహాయక చర్యల కోసం హెలీకాప్టర్ ను వినియోగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో... ఇప్పటివరకూ సుమారు 70 మందిని కాపాడి.. ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి! ఇదే సమయంలో ఈ ఘోర ప్రమాదంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఇందులో భాగంగా... సంబంధిత ప్రభుత్వ సంస్థలతో పాటు ఇతరాత్ర యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు.

ఇక ప్రధానంగా... చురల్మల వద్దనున్న ఏకైక వంతెనతో పాటు ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమవ్వడంతో సుమారు 250 మంది ఎన్.డీ.ఆర్.ఎఫ్. సిబ్బంది ముండకై ఆవలవైపు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ సమయంలో సైన్యం అక్కడ తాత్కాలిక వంతెనను నిర్మిస్తే.. ఆ ప్రాంతానికి కూడా చేరుకొని చర్యలు చేపట్టనున్నారని అంటున్నారు. వంతెన పోవడంతో అసలు అక్కడ పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయుసేనకు చెందిన రెండు హెలీకాప్టర్లు వయనాడ్ కు చేరుకొన్నప్పటికీ... భారీ వర్షాలు కొనసాగుతుండటం వల్ల పరిమిత స్థాయిలోనే అవి సేవలు అందించే పరిస్థితి నెలకొందని అంటున్నారు. అయితే... ఈ కొండచరియలు విరిన ప్రాంతాల్లో ఎక్కడా ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో అవి తిరిగి కోజికోడ్ కు వెళ్లిపోయాయని చెబుతున్నారు.

ఈ సమయంలో కేరళలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. వీటిలో మల్లప్పురం, వయనాడ్, కోజీకోడ్, కన్నూరు, కసరగోడ్ జిల్లాలు ఉన్నాయి. రానున్న 24 గంటల్లో ఇక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ... ఎర్నాకులం, త్రిశూర్, పాల్కడ్, ఇడుక్కీ జిల్లాలోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

మరోవైపు కేళలోని పరిస్థితిపై కేంద్రం రక్షణ మంత్రి రాజ్ నాథ్ స్పందించారు. ఇందులో భాగంగా... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో తాజా పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో... ఇప్పటికే 122 ఇన్ ఫాంట్రీ బెటాలియన్ కు చెందిన రెండు కాలంస్ వెళ్లినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. మొత్తం మీద 225 మంది సైన్యం సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు.

స్టాలిన్ ఆపన్నహస్తం:

కేరళలోని వయనాడ్ జిల్లా అతలాకుతలమైన నేపథ్యంలో... ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ప్రజలు సజీవ సమాధి కాగా.. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పక్కనున్న తమిళనాడు రాష్ట్రం ఆపన్న హస్తం అందించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నిధుల నుంచి రూ.5 కోట్లు విడుదల చేయాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు.

ఇదే సమయంలో.. 20 మంది అగ్నిమాపక సిబ్బంది, 10 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని కేరళకు పంపించనున్నట్లు వెల్లడించారు.