Begin typing your search above and press return to search.

కేరళకు శాపంగా మారిన 2 నెలలు.. పెను విపత్తులన్నీ అప్పుడే!

దేవుళ్లు.. దేవతలు నడయాడే భూమిగా కేరళకు పేరు. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఉంటుంది కేరళ.

By:  Tupaki Desk   |   31 July 2024 5:16 AM GMT
కేరళకు శాపంగా మారిన 2 నెలలు.. పెను విపత్తులన్నీ అప్పుడే!
X

దేవుళ్లు.. దేవతలు నడయాడే భూమిగా కేరళకు పేరు. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఉంటుంది కేరళ. ఈ రాష్ట్ర ప్రజల జీవన విధానం కాస్త కొత్తగా ఉంటుంది. పేరుకు దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ.. వీరు ఎక్కువగా ప్రక్రతి ఒడిలో జీవిస్తుంటారు. చుట్టూ పచ్చని వాతావరణంలో ప్రశాంత జీవనం సాగించే వీరికి.. ఏడాదిలో రెండు నెలలు మాత్రం కాళరాత్రుల్ని తలపించే పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

రెండు తెలుగు రాష్ట్రాల వారికి కేరళ వెళితే దిక్కు తోచని పరిస్థితి. కారణం.. రాత్రి జీవితం చాలా తక్కువగా ఉండటమే. సాయంత్రం ఏడు దాటితే కేరళలోని చాలా ప్రాంతాల్లోని రోడ్లపై జనాలు కనిపించరు. పట్టణాల్లో మాత్రమే కాదు.. రాష్ట్ర రాజధాని నగరంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. నేచర్ కు దగ్గరగా జీవించే కేరళీయులకు ఏడాదిలో జులై.. ఆగస్టు మాసాలు చీకటి మాసాలుగా చెబుతారు. ఎందుకంటే.. ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న పెను విపత్తులన్నీ కూడా ఈ రెండు నెలల్లోనే చోటు చేసుకోవటం దీనికి కారణం.

తాజాగా కొండ చరియలు విరిగిపడిన ఉదంతంలో 151 (బుధవారం ఉదయం 8 గంటల నాటికి) మంది ప్రాణాలు కోల్పోతే.. మరో 128 మందికి గాయాలు అయ్యాయి. వందలాది మంది ఆచూకీ లభ్యం కావట్లేదు. వీరి కోసం వెతుకులాట భారీ ఎత్తున సాగుతోంది. ఓవైపు భారీ వర్షం మరోవైపు కొండ రాళ్లు విరుచుకుపడిన విషాదంలో వందల మంది బురదలో కూలుకుపోయారు. మొత్తంగా పెను విషాదం కేరళను కమ్మేసింది. జులై.. ఆగస్టు ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో కురిసే వానలు.. విరుచుకుపడే వరదలతో పలు విషాద ఉదంతాలు చోటుచేసుకోవటంతో... ఈ రెండు నెలల్లో అక్కడి ప్రజలు టెన్షన్ తో ఉంటారు. ఏ రోజు ఏ ముప్పు మీద పడుతుందన్నట్లుగా పరిస్థితి ఉంటుంది.

2020 ఆగస్టు 6న ఇడుక్కి జిల్లాలోని పెట్టిముడిలో ఇదే తరహాలోభారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019ఆగస్టులో మలప్పురం.. వయనాడ్.. కోళికోడ్ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడిన ఉదంతాల్లో 76 మంది చనిపోయారు. వారిలో పదహారు మంది డెడ్ బాడీలు నేటికి లభించలేదు. 2021 ఇడుక్కి జిల్లాలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి.. 21 మంది మరణించారు. 2018 ఆగస్టులో కేరళను తీవ్ర విషాదంలో ముంచెత్తిన వరదల్లో ఏకండా 483 మంది మరణించటం.. దీనిపై కొంతకాలం క్రితం సినిమాగా రావటం తెలిసిందే. కేరళ వరద తీవ్రతను కళ్లకు కట్టినట్లుగా చూపిన ఈ సినిమా ఎందరినో కదిలించేసింది.

2018లో సాధారణ వర్షపాతం కంటే 23 శాతం ఎక్కువగా ఉండటంతో రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. దీంతో కేరళలోని 54 డ్యాముల్లో 34 డ్యాములను తెరిచి నీటిని వదిలేశారు. ఒకేసారి అన్ని డ్యాములను తెరవటం ఆ రాష్ట్ర చరిత్రలో అదే మొదటిసారి. ఆ సమయంలో కేరళలోని దాదాపు 5వేల చిన్న.. పెద్ద కొండచరియలు విరిగిపడినట్లు ఒక అంచనా. అడవుల నిర్మూలన.. పర్యావరణ మార్పులు.. పెరుగుతున్న భూతాపం.. ఆరేబియా ఉపరితల జలాలు వేడెక్కిన కారణంగానే 2018.. ఆ తర్వాత సంవత్సరాల్లో కేరళలో విపత్తులు ఎక్కువగా విరుచుకుపడినట్లుగా చెబుతారు.

కేరళలోని మొత్తం 14 జిల్లాల్లో ఒక్క అలప్పుజ జిల్లా తప్పించి మిగిలిన 13 జిల్లాలూ వరదలు..కొండచరియలు విరిగి పడే ముప్పును ఎదుర్కొంటున్నవే కావటం గమనార్హం. భారీగా కొండ చరియలు విరిగిపడటానికి భారీ వర్షాలు కారణంగా చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటన్న దానిపై నిపుణుల వాదన ప్రకారం.. అరేబియా సముద్రం వేడెక్కుతుండటంతో కేరళలోని పలు ప్రాంతాల్లో డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ఏర్పడి అతిభారీవర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. మొత్తంగా మనిషి చేసే తప్పులకు.. మరో మనిషికి తిప్పలు తప్పట్లేదు.