దేశంలో పేదలు లేని రాష్ట్రం ఇదే... తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి..?
దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్ధాలు అవుతున్నా.. పేదలు పేదలుగానే ఉన్నారు, ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారనే కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.
By: Tupaki Desk | 19 Jan 2024 4:52 AM GMTదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్ధాలు అవుతున్నా.. పేదలు పేదలుగానే ఉన్నారు, ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారనే కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. రాజకీయ పార్టీలు కూడా స్వాతంత్ర భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల నుంచి నేటి వరకూ పేదరిక నిర్మూళనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతుంటారు! ప్రతీ ఎన్నికల్లోనూ చెప్పడానికో ఏమో కానీ... వారి సంఖ్యను అలానే కంటిన్యూ చేస్తున్నారనే మాటలు వినిపిస్తుంటాయి!
ఈ క్రమంలో స్వాతంత్రం వచ్చిన ఇంతకాలం తర్వాత అతి తక్కువగా, అంటే ఆల్ మోస్ట్ అరశాతం కంటే తక్కువమంది పేదలు కలిగిన రాష్ట్రం తెరపైకి వచ్చింది. తాజాగా నీతి ఆయోగ్ వెల్లడించిన న్నివేదిక ప్రకారం ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సగటు భారతీయుడు గర్వించదగ్గ విషయంగా దీన్ని చెబుతున్నా.. దేశంలోని మిగతా రాష్ట్రాల పరిస్థితి ఆ అనందం లేకుండా చేస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... మొదలైందని మాత్రం చెప్పుకోవచ్చు.
అవును... గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునే కేరళ రాష్ట్రం దేశంలోనే అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2005-06లో కేరళ జనాభాలో 12.31 శాతం మంది పేదలు ఉండగా.. తాజాగా 2022-23లో కేరళ జనాభాలో పేదరికం 0.48 శాతానికి తగ్గింది. అంటే... ప్రస్తుతం కేరళ జనాభాలో కేవలం అరశాతం కంటే తక్కువ మంది పేద ప్రజలు ఉన్నారన్నమాట.
ఇక దేశంలో పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం బీహార్ లో 26.59 శాతం పేదరికం ఉంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్ లో 4.19 శాతం పేదలు ఉండగా.. తెలంగాణలో మూడు శాతం మంది ఉన్నారు. వాస్తవానికి రెండు దశాబ్ధాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు పేదరికం చాలా వరకూ తగ్గిందనే చెప్పాలి.
ఇందులో భాగంగా... 2005-06లో దేశంలో పేదరికం 55.34 శాతం ఉండగా... అది 2022 -23 నాటికి 11.28 శాతానికి తగ్గింది. వాస్తవానికి పోషకాహార లభ్యతతో పాటు ప్రధానంగా శిశు మరణాల రేటు, విద్య, విద్యుత్తు, పారిశుధ్యం, ఇళ్లు, వంట ఇంధనం, బ్యాంకు ఖాతా వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని పేదరిక స్థాయిని లెక్కించారు. కాగా ఈ పారామీటర్స్ పైనా వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే.