Begin typing your search above and press return to search.

ఎంపీ సీట్ల‌కు క‌ర్చీఫ్‌.. కాంగ్రెస్ నిర్ణ‌య‌మే త‌రువాయి!

సాగ‌ర్ నుంచి త‌న కుమారుడు జైవీర్ రెడ్డిని గెలిపించుకున్న జానా.. ఎంపీ సీటుపై ఆశ‌లు పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 11:30 AM GMT
ఎంపీ సీట్ల‌కు క‌ర్చీఫ్‌.. కాంగ్రెస్ నిర్ణ‌య‌మే త‌రువాయి!
X

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక‌వైపు పాల‌న జ‌రుగుతుండ‌గానే.. మ‌రోవైపు ముఖ్య నాయ‌కులు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న‌వారు, పోటీ చేసి ఓడిన పోయిన వారు .. పార్ల‌మెం టు ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ జాబితాలో జానారెడ్డి, రేణుకా చౌద‌రి, ష‌బ్బీర్ అలీ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. సాగ‌ర్ నుంచి త‌న కుమారుడు జైవీర్ రెడ్డిని గెలిపించుకున్న జానా.. ఎంపీ సీటుపై ఆశ‌లు పెట్టుకున్నారు.

త‌న కుమారుడికి ఎలాంటి ప‌ద‌వీ అవ‌స‌రం లేద‌ని, ఎమ్మెల్యే అయ్యారు అది చాల‌ని వ్యాఖ్యానించిన జానా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ల్గొండ ఎంపీ సీటును త‌న‌కు ఇవ్వాల‌ని చెప్పుకొచ్చారు. ఇస్తానంటే కాద‌న‌ని చెబుతూనే ఇవ్వాల్సిందేనన్న దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇక‌, ఖ‌మ్మంలో కాంగ్రెస్ గెలుపును త‌న ఖాతాలో వేసుకు న్న రేణుకా చౌద‌రి కూడా పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు.

సుదీర్ఘ‌కాలంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న రేణుక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం సీటు నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ బీఆర్ ఎస్ నేత నామా నాగేశ్వ‌ర‌రావు విజ‌యం ద‌క్కించుకు న్నారు. ఇక‌, కాంగ్రెస్ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్న‌ట్టు రేణుక చెబుతున్నారు. అంతేకాదు.. ఇది త‌న‌కే ద‌క్కుతుంద‌ని కూడా ఆమె చెబుతున్నారు.

ఇక, తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ష‌బ్బీర్ అలీకి శాస‌న మండ‌లి సీటు ద‌క్కే అవ‌కాశం ఉంది. కానీ, ఆయ‌న ఈ ద‌ఫా పార్ల‌మెంటుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు అలీ అనుచరులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఏదేమైనా.. కీల‌క నాయ‌కులు అప్పుడే క‌ర్చీఫ్‌లు ప‌ట్టుకుని రెడీగా ఉండ‌డంతో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యంఎలా ఉంటుందో చూడాలి.