Begin typing your search above and press return to search.

'కేశవ్ కుంజ్'.. గుర్తు పెట్టుకోండి ఈ పేరును: పవర్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్

ఇంత బిల్డప్ ఇస్తున్నారు? ఇంతకూ ఆ భవనం ఏమిటి? దానికి అంత సీన్ ఉందా? అన్న సందేహం రావొచ్చు. చదువుతూ ఉంటే తెలుస్తుంది దాని రేంజ్ ఏమటన్నది.

By:  Tupaki Desk   |   20 Feb 2025 7:30 AM GMT
కేశవ్ కుంజ్.. గుర్తు పెట్టుకోండి ఈ పేరును: పవర్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్
X

అదేం సిత్రమో కానీ.. మొయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని ఆసక్తికర అంశాల్ని అస్సలు పట్టించుకోదు. ఆ మాటకు వస్తే.. దానికి కించిత్ ప్రాధాన్యత ఇవ్వదు. భవిష్యత్ దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారే ఒక భారీ భవనం ప్రారంభమైన వేళలోనూ.. దాని గురించి పెద్దగా సమాచారం ఇవ్వకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. ఇంత బిల్డప్ ఇస్తున్నారు? ఇంతకూ ఆ భవనం ఏమిటి? దానికి అంత సీన్ ఉందా? అన్న సందేహం రావొచ్చు. చదువుతూ ఉంటే తెలుస్తుంది దాని రేంజ్ ఏమటన్నది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో బుధవారం కేశవ్ కుంజ్ అనే భారీ భవనం ఒకటి ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు అమిత్ షా.. రాజ్ నాథ్ సింగ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఏమిటీ కేశవ్ కుంజ్? అంటే.. ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యాలయం తాజాగా ప్రారంభమైంది. గతంలో రెండు అంతస్తుల్లో ఉండే భవనాన్ని కూల్చేసి.. దాని స్థానంలో భారీ భవన సముదాయాన్ని నిర్మించారు. 3.75 ఎకరాల విస్తీర్ణంలో మూడు టవర్లను.. ఒక్కో టవర్ లో 12 అంతస్తులతో కలిపి మొత్తం.. 5 లక్షల చదరపు అడుగుల్లో ఈ భారీ నిర్మాణం ఉంది.

కేశవ్ కుంజ్ లో దాదాపు 300 గదులు.. పలు కార్యాలయాలు ఉంటాయి. ఈ మూడు టవర్లకు సాధన.. ప్రేరణ.. అర్చన అన్న పేర్లు పెట్టారు. మొదటి టవర్ సాధన కాగా.. రెండోది ప్రేరణ. మూడోది అర్చన టవర్. ఈ భారీ ప్రాజెక్టును రూ.150 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో దీన్ని నిర్మించినట్లుగా చెబుతారు. దాదాపు 75 వేల మంది విరాళాలు ఇచ్చినట్లుగా ఆర్ఎస్ఎస్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టును 2016 నవంబరులో పునాది రాయి వేయగా.. అనుకున్నంత వేగంగా దీన్ని పూర్తి చేయలేకపోయారు. తాజాగా దీన్ని పూర్తి చేయటమే కాదు.. ఈ భవనం పని చేయటం మొదలు పెట్టిందని చెప్పాలి.

కేశవ్ కుంజ్ మొత్తంలో 13 లిఫ్టులు ఉన్నాయి. మొదటి రెండు టవర్లలో ఐదు.. మూడో టవర్ లో మూడు లిఫ్టులతో పాటు.. ప్రతి టవర్ లోనూ సర్వీసు లిప్టును కూడా ఏర్పాటు చేశారు. గుజరాత్ కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్టు.. సంఘ్ కు చెందిన అనూప్ డేవ్ రూపొందించారు. రెండు.. మూడు టవర్ల మధ్యలో విశాలమైన ప్రదేశం ఉంది. అక్కడే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని సంఘ్ స్థాన్ అని పిలుస్తారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ భారీ భవన సముదాయంలో విశ్వ హిందూపరిషత్ అధినేత దివంగత అశోక్ సింఘాల్ పేరు మీద ఒక పెద్ద ఆడిటోరియంను ఏర్పాటు చేశారు. లైబ్రరీతో పాటు.. హెల్త్ క్లినిక్ మొదలు డయాగ్నస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు.. సంఘ్ కు చెందిన అనుబంధ వారపత్రికలు.. పాంచజన్య.. ధర్గనైజర్.. సురుచి పబ్లికేషన్స్ కార్యాలయాల్ని ఇందులో ఏర్పాటు చేశారు.

కేశవ్ కుంజ్ లో రెండు అంతస్తుల్ని ఆర్ఎస్ఎస్ ఢిల్లీ విభాగానికి కేటాయించారు. ఒక ఫ్లోర్ ను అంతర్జాతీయ సంఘ్ కార్యకలాపాలకు కేటాయించారు. ఈ భారీ భవనంలో ఐదు పడకలతో కూడిన ఆసుపత్రి.. ఫాథాలజీ ల్యాబ్ తో పాటు.. మరికొన్ని వసతుల్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. మోడ్రన్ జిమ్ ను ఏర్పాటు చేశారు. దీన్లో హనుమాన్ ఆలయం కూడా ఏర్పాటు చేశారు.