ఫామ్ హౌస్ 'క్లాస్' రియాక్షన్.. మీడియా మీద చూపిస్తే ఎలా కేకే?
దాదాపు మూడు గంటల పాటు కేసీఆర్ తో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన.. అనంతరం హైదరాబాద్ లోని తన నివాసానికి నేరుగా వచ్చేశారు.
By: Tupaki Desk | 29 March 2024 6:30 AM GMTబీఆర్ఎస్ లో కీలక స్థానంలో ఉన్న ముఖ్యనేతల్లో కె. కేశవరావు ఒకరు. తాజాగా ఆయన కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ కావటం తెలిసిందే. దీనికి సంబంధించి గ్రౌండ్ రెఢీ చేసుకుంటున్న వేళ.. ఆయన అనుకోని అనుభవం ఎదురైంది. ఫాంహౌస్ కు రావాలంటూ కేసీఆర్ నుంచి అందిన ఆహ్వానం మీద ఆయన ఎర్రవెల్లికి వెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు కేసీఆర్ తో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన.. అనంతరం హైదరాబాద్ లోని తన నివాసానికి నేరుగా వచ్చేశారు. పార్టీ మారాలన్న నిర్ణయాన్ని తీసుకున్న కేకేపై కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
అత్త మీద కోపం దుత్త మీద చూపిందన్న సామెతకు తగ్గట్లే.. కేసీఆర్ ఫామ్ హౌస్ ఎఫెక్టును కేకే తన ఇంటి వద్ద ఉన్న మీడియా ప్రతినిధులపై చూపారు. కుమార్తె కం హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న కేకే.. తనను ప్రశ్నిస్తున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పని ఆయన.. తనదైన రీతిలో రియాక్టు అయ్యారు. మరోవైపు.. ఆయన కోసం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెయిట్ చేయటం.. కేకే వచ్చిన తర్వాత ఆయనతో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.
కేకే పార్టీ మారాలన్న నిర్ణయంపై కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారని.. ‘మీకేం తక్కువ చేశానని పార్టీ మారుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇంత చేస్తే.. ఇప్పుడు పార్టీ మారిపోతారా?’ అంటూ తన అసహనాన్ని ప్రదర్శించారని.. దీనికి బదులుగా తాను కాంగ్రెస్ లోకి వెళ్లక తప్పని పరిస్థితి ఉందన్న విషయాన్ని కేసీఆర్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫాంహౌస్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో.. దానిపై అంతో ఇంతో స్పందిస్తారన్న ఉద్దేశంతో మీడియా ప్రతినిధులు కేకే ఇంటి వద్ద వేచి చూస్తే.. వచ్చీరావటంతోనే బరస్ట్ అయిన కేకే తీరు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కేకే కుమారుడు విప్లవ్ మాత్రం తాను పార్టీ మారేది లేదని.. బీఆర్ఎస్ లో కొనసాగుతానని.. తన బాస్ కేసీఆర్ అంటూ చెప్పుకోవటం గమనార్హం.