కేశినేని ప్రజా సేవ ఆ పార్టీ నుంచేనా ?
కేశినేని నాని బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న టాక్ అయితే గుప్పుమంటోంది. ఆయన నందిగామలో జరిగిన సభలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తావనను తీసుకుని వచ్చారు.
By: Tupaki Desk | 18 Feb 2025 3:23 AM GMTవిజయవాడ నుంచి రెండు సార్లు లోక్ సభ సభ్యుడిగా గెలిచిన రికార్డు కేశినేని నాని సొంతం. అంతకు ముందు వరసగా లగడపాటి రాజగోపాల్ ఇదే విజయవాడ నుంచి లోక్ సభ సభ్యుడు అయ్యారు. ఇలా కేశినేని నానికి ఒక అద్భుత అవకాశమే విజయవాడ వాసులు ఇచ్చారు. ఆయన 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యాక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే తాజాగా ఆయన ప్రజా సేవ చేస్తాను అని అంటున్నారు. అయితే దీని వెనక కారణాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. కేశినేని నాని బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న టాక్ అయితే గుప్పుమంటోంది. ఆయన నందిగామలో జరిగిన సభలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తావనను తీసుకుని వచ్చారు. ఆయన సహకారంతో విజయవాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయించాను అని చెప్పారు.
నిజంగానే నితిన్ గడ్కరీతో నానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆయన 2019 తరువాత ఒక దశలో బీజేపీలోకి చేరుతారు అని అనుకున్నారు. అయితే బీజేపీ టీడీపీల మధ్య పొత్తు ఉండడంతో పాటు వైసీపీ నుంచి ఇన్విటేషన్ ఉండడంతో ఆయన ఫ్యాన్ నీడకు చేరారు. అందులో చేరి కేవలం ఎన్నికల్లో పోటీ చేశారు తప్ప ఎక్కువ రోజులు ఆ పార్టీలో కొనసాగలేక పోయారు.
ఈ క్రమంలో కొంత కాలం విరామం ప్రకటించిన నాని మళ్ళీ జనంలోకి వస్తున్నారు. ఆయన ఇప్పటికే బీజేపీ నేతలకు టచ్ లోకి వచ్చారని వారు కూడా ఆయనను పార్టీలోకి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారని అంటున్నారు. అదే విధంగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరితోనూ పార్టీలో చేరే విషయం నాని మాట్లాడారని ఆమె నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే కేశినేని నాని నోటి వెంట ప్రజా సేవ అన్న మాట వచ్చిందని అంటున్నారు. మరో వైపు చూస్తే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంత తీవ్రంగా కాకపోయినా కేశినేని నాని కూడా టీడీపీ అధినాయకత్వం మీద ఘాటుగానే విమర్శలు చేశారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరాలనుకున్నా అయ్యే పని కాదని అంటున్నారు.
దాంతో ఆయన బీజేపీ బాటను ఎంచుకున్నారని చెబుతున్నారు. ఇక చూస్తే తొందరలోనే కేశినేని నాని బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు అని అంటున్నారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో ఉండడం ద్వారా తన రాజకీయ జీవితంతో పాటు కుమార్తె రాజకీయ జీవితానికి కూడా బాటలు వేసుకోవచ్చు అన్నది ఆయన ఆలోచన అని చెబుతున్నారు.
ఇక విజయవాడలో అయితే కేశినేని చిన్ని పూర్తిగా టీడీపీలో ఆధిపత్యం చలాయిస్తున్నారు. అందువల్ల ఆయనను కాదని ఎవరినీ తీసుకునే చాన్స్ లేదు. అయితే కూటమిలో ఉంటూ టీడీపీ వ్యతిరేకించే వారిని బీజేపీ ఎలా చేర్చుకుంటుంది అన్న చర్చ ఉండనే ఉంది. కానీ ఎవరి రాజకీయం వారిది అన్నట్లుగానే బీజేపీ ఈ విషయంలో వ్యవహరిస్తుంది అని అంటున్నారు.