కేశినేని ఎవరి పక్షం.... ఎటువైపు... బెజవాడ హాట్ టాపిక్..!
వైసీపీ ఎమ్మెల్యేలతో కేశినేని రాసుకుని పూసుకుని తిరుగుతున్నారని దీనివల్ల టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుగు దేశం నేతలు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 10 Aug 2023 6:26 AM GMTవిజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని ఎవరి పక్షం? ఆయన ఎవరికి అండగా ఉంటారు? వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికి ఉంటుంది? అనే చర్చ ఉమ్మడి కృష్ణాజిల్లాలో జోరుగా సాగుతోంది. విజయవాడ పార్లమెంటు పరిధి.. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పరిధిలో ఉన్నాయి. తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలు ఉన్నాయి.
అయితే.. వీటిలో ఒక్క విజయవాడ ఈస్ట్ మాత్రమే 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. వాస్తవానికి బలమైన టీడీపీ కేడర్ ఉన్న నియోజకవర్గాలే అయినప్పటికీ.. గత ఎన్నికల్లో వైసీపీ హవా, జగన్ పాదయాత్ర వంటివి ఇక్కడ ప్రభావం చూపించాయనే టాక్ వినిపించింది. కానీ, అంతర్గతంగా మాత్రం 2019లోనూ ఎంపీ కేశినేని నాని టీడీపీ నాయకులకు సహకరించలేదనే వాదన ఉంది.
ఇక, ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే.. ఆయన వైసీపీ నేతలతోనే ఎక్కువగా టచ్‌లో ఉంటున్నారు. టీడీపీలోనే ఉన్నప్పటికీ.. తన నియోజకవర్గం నేతలతో ఆయన అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పైగా వారితో విభేదిస్తున్నారు కూడా. మైలవరం, నందిగామ నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలతో కేశినేని రాసుకుని పూసుకుని తిరుగుతున్నారని దీనివల్ల టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుగు దేశం నేతలు భావిస్తున్నారు.
మరోవైపు.. విజయవాడ ఈస్ట్‌పై కేశినేని నాని కన్నేశారనే చర్చ సాగుతోంది. అదేవిధంగా కుదిరితే వెస్ట్ లేదా.. ఈస్ట్ తన కుటుంబానికి ఇవ్వాలనే చర్చ కూడా ఆయన తెరమీదికి తెచ్చారు. దీనిని టీడీపీలోని మెజారిటీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరి పక్షాన ఆయన నిలుస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే.. కేశినేని చాలా వరకు తటస్థంగా ఉంటున్నారు. అదేసమయంలో వైసీపీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. మరి ఎన్నికల సమయానికి ఆయన ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో చూడాలి.