సకుటుంబ సపరివారంగా.. కేశినేని రాజకీయ వేడి
తన కుమార్తె కేశినేని శ్వేత.. కూడా టీడీపీకి రాజీనామా చేస్తుందని తెలిపారు.
By: Tupaki Desk | 8 Jan 2024 6:06 AM GMTవిజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని.. రోజుకో వార్తతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని.. టీడీపీకి రిజైన్ చేస్తానని చెప్పిన ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇక, తాజాగా సోమవారం ఉదయాన్నే ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. తన కుమార్తె కేశినేని శ్వేత.. కూడా టీడీపీకి రాజీనామా చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఆమె కార్పొరేటర్‌గా ఉన్నారు.
2022లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో.. విజయవాడలోని 11వ వార్డు నుంచి శ్వేత ఎన్నికయ్యారు. అప్పట్లో టీడీపీ కనుక ఈ కార్పొరేషన్‌ను దక్కించుకుంటే.. శ్వేతను మేయర్‌ను చేయాలన్నది నాని చేసుకున్న ఒప్పందంగా ప్రచారం జరిగింది. అయితే.. టీడీపీ దక్కించుకోలేక పోయింది. ఇక, ఇప్పుడు నాని టీడీపీలో రెండు టికెట్లు కోరుతున్న విషయం తెలిసిందే. ఒకటి తనకు ఎంపీ సీటు, రెండు తన కుమార్తె శ్వేతకు.. విజయవాడ పశ్చిమ లేదా, తూర్పు నియోజకవర్గాల్లో ఒకటి.
కానీ, టీడీపీ అధిష్టానం.. నానికే టికెట్ ఇవ్వడం లేదని తేల్చేయడం..ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టికెట్ ఇచ్చేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నాని పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో శ్వేత కూడా రాజీనామా చేస్తుందని ఆయన తాజాగా పోస్టు చేశారు. మాజీ సీఎం చంద్రబాబును కలిసి శ్వేత తన రాజీనామాను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం కేశినేని, ఆయన కుమార్తె ఇద్దరూ కూడా సైకిల్ దిగనున్నారు.
ఏం జరుగుతుంది?
ఈ క్రమంలో కేశినేని నాని రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది ఆసక్తిగా మారింది. ఆయన వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. కానీ, అంతర్గతంగా మాత్రం ఆయన చూపు బీజేపీపై ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి వెళ్తే.. టీడీపీ నుంచి విమర్శలు ఎదుర్కొనాల్సి ఉన్నందున.. బీజేపీలోకి వెళ్తే.. ఎలాంటి ఇబ్బంది ఉండదని.. నాని భావిస్తున్నట్టు ఆయన వర్గం గుసగుసలాడుతోంది.
ఈ క్రమంలో తన కుమార్తెను కూడా కమలం పార్టీలో చేర్చి.. తూర్పు సీటు ను దక్కించుకునేలా కేశినేని ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. మహారాష్ట్రకు చెందిన ఒకరిద్దరు బీజేపీ కేంద్ర మంత్రులతో నానికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఆదిశగా అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.