అన్నదమ్ముల సవాల్
రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధి ఎవరు ? నువ్వా నేనా ? అనే పద్దతిలో అన్నదమ్ముల మధ్యే పోటీ మొదలైంది.
By: Tupaki Desk | 5 Sep 2023 6:26 AM GMTరాబోయే ఎన్నికల్లో అభ్యర్ధి ఎవరు ? నువ్వా నేనా ? అనే పద్దతిలో అన్నదమ్ముల మధ్యే పోటీ మొదలైంది. సవాళ్ళు ప్రతిసవాళ్ళు పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమింటటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీచేయబోయేది ఎవరు ? ఇపుడిదే పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఒకవిధంగా హాట్ టాపిక్ అయిపోయినా మరోవిధంగా అయోమయం పెరిగిపోతోంది. ఈ అయోమయానికి కారణం మాత్రం సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని అనే చెప్పాలి.
పార్టీతో ఎంపీ అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి పార్టలో ఫుల్లు ఇన్వాల్వ మెంటుతో పనిచేస్తున్నట్లు కనిపిస్తారు. మరోసారి పార్టీతో తనకేమి సంబంధం అన్నట్లుగానే మాట్లాడుతారు. ఏకంగా చంద్రబాబునే థిక్కరించినట్లు వ్యవహరిస్తారు. దాంతో ఎంపీ మనసులో ఏముందో ఎవరికీ అర్ధంకావటంలేదు. దాంతో నానితో లాభంలేదని అనుకుని చంద్రబాబు కేశినేని చిన్నీని ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు. పార్టీ కార్యక్రమాల్లో చిన్నీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో పర్యటించటం కూడా మొదలుపెట్టారు.
చంద్రబాబు ఆదేశాలతో చిన్నీని తమ్ముళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు. చిన్నీ పర్యటనలపైన, చంద్రబాబు ఎంకరేజ్ చేయటంపైన కూడా ఎంపీ నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో రాబోయే ఎన్నికల్లో చిన్నీయే టీడీపీ ఎంపీ అభ్యర్ధి అని అందరు అనుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో తానే అభ్యర్ధిగా పోటీచేయబోతున్నట్లు నాని ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా కనబడుతున్నారు. దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లయ్యింది.
మధ్యలో కొన్నిరోజులు అన్న, దమ్ముళ్ళే ఒకళ్ళపై మరకొళ్ళు సవాళ్ళు కూడా విసురుకున్నారు. ఇంతజరిగిన తర్వాత రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసేది ఎవరు అన్న అయోమయం పార్టీలో పెరిగిపోతోంది. అభ్యర్ధి విషయంలో చంద్రబాబు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టే తమ్ముళ్ళలో కూడా అయోమయం పెరిగిపోతోంది. అన్నదమ్ముల్లు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎవరి ప్రోగ్రాములకు హాజరవ్వాలో తమ్ముళ్ళకు అర్ధంకావటంలేదు. ఇలాంటి కన్ఫ్యూజన్ వల్లే చివరకు పార్టీకి దెబ్బతింటుందని తమ్ముళ్ళు గోలచేస్తున్నారు. అభ్యర్ధి విషయంలో తమకు చంద్రబాబు ఏదో ఒక క్లారిటి ఇవ్వాలని మొత్తుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.