బెజవాడ బ్రదర్స్ మధ్య ఫోన్ ట్యాపింగ్ రగడ!
బెజవాడ బ్రదర్స్.. కేశినేని నాని, చిన్నిల వివాదం రోజురోజుకూ పెద్దదవుతోంది. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు
By: Tupaki Desk | 24 March 2024 7:09 AM GMTబెజవాడ బ్రదర్స్.. కేశినేని నాని, చిన్నిల వివాదం రోజురోజుకూ పెద్దదవుతోంది. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని వైసీపీ తరఫున, ఆయన తమ్ముడు కేశినేని చిన్ని టీడీపీ తరఫున విజయవాడ ఎంపీ స్థానంలో కాలు దువ్వుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి పేర్లను ఆయా పార్టీలు ప్రకటించాయి. దీంతో ప్రచారంలో భాగంగా అన్నదమ్ములు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా తెరమీదకొచ్చాయి. తన ఫోన్ ను ఎప్పటి నుంచో చంద్రబాబు తెలంగాణ నుంచి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేశినాని నాని సంచలన ఆరోపణలు చేశారు.
కేశినేని చిన్ని సైతం తన ఫోన్ ను జగన్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్లే అక్కడికి ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘాలో వచ్చి తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనుక కేశినేని నాని ఉన్నారని ధ్వజమెత్తారు. ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తనకు ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ చెప్పాడన్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
దీంతో ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రణీత్ రావు అనే సీఐతోపాటు ఇద్దరు ఏఎస్పీలను అరెస్టు చేశారు. కీలక సూత్రధారులు, పాత్రధారుల కోసం వేట కొనసాగుతోంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు ఫోన్లను కూడా విడిచిపెట్టడం లేదని ట్యాపింగ్ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి గతంలోనే తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ భయంతో కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా భయమేస్తోందన్నారు.
ఇప్పుడు ఇవే ఆరోపణలను బెజవాడ బ్రదర్స్ కేశినేని నాని, కేశినేని చిన్ని ఒకరిపై ఒకరు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జగన్ ప్రభుత్వం మాత్రం ఫోన్ ట్యాపింగ్ కు ఆద్యుడు చంద్రబాబేనని విమర్శిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ సమయంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ నుంచి పెగసెస్ సాఫ్ట్ వేర్ ను కొన్నారని.. దీని ద్వారా ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తోంది.
ఇప్పుడు కేశినేని నాని, కేశినేని చిన్ని సైతం తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు. చంద్రబాబు తన ఫోన్ ను హైదరాబాద్ నుంచి ట్యాప్ చేయిస్తున్నారని కేశినేని నాని ఆరోపిస్తుంటే.. కేశినేని చిన్ని తన ఫోన్ ను వైఎస్ జగన్ ట్యాప్ చేయిస్తున్నారని మండిపడుతున్నారు.