చిన్నికి సీటు చింపేసినట్టేనా?
మరోవైపు టీడీపీ తరఫున కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని పేరు నిన్నమొన్నటి వరకు బలంగా వినిపించింది
By: Tupaki Desk | 31 Jan 2024 9:30 AM GMTటీడీపీకి కంచుకోటగా చెప్పుకునే పార్లమెంటరీ నియోజకవర్గాల్లో విజయవాడ ఒకటి. వైసీపీ గాలి ప్రభంజనంలా వీచిన 2019లోనూ విజయవాడ ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థికే విజయం దక్కింది. 2014లోనూ టీడీపీయే విజయకేతనం ఎగురవేసింది. ఇప్పటివరకు వైసీపీ విజయవాడ ఎంపీ సీటును గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలని వైసీపీ అధిష్టానం కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిని పార్టీలో చేర్చుకుని సీటు ఇచ్చింది.
మరోవైపు టీడీపీ తరఫున కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని పేరు నిన్నమొన్నటి వరకు బలంగా వినిపించింది. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకలాపాలను కూడా చిన్ని చురుగ్గా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు చిన్నిని పక్కకు తప్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది..
టీడీపీ... వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకుండా తన సోదరుడు చిన్నిని ప్రోత్సహించడంతో కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని కేశినేని నాని సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే తనపై చంద్రబాబు పోటీ చేయాలని తొడగొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొంది చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని కేశినేని నాని పావులు కదుపుతున్నారు.
ఈ నేపథ్యంలో తమ సిట్టింగ్ సీటైన విజయవాడను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని స్థానంలో గద్దె రామ్మోహన్ ను బరిలోకి దించాలని యోచిస్తున్నారు. 1999లో గద్దె రామ్మోహన్ విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున విజయం సాధించారు.
2014, 2019 ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన గద్దెకు వివాద రహితుడిగా, సౌమ్యుడిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుంది. అంతేకాకుండా గతంలో ఓసారి ఎంపీగానూ పనిచేసి ఉండటంతో చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కేశినేని చిన్నిని గద్దె రామ్మోహన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ తూర్పు నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది.
ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో కేశినేని నానిని 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిస్తామని విజయవాడ టీడీపీ నేతలు సవాల్ చేశారు. ఇది జరగాలంటే గద్దె రామ్మోహన్ అయితే సాధ్యమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా తెలియజేయడంతో ఇందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.