Begin typing your search above and press return to search.

కేశినేని దమ్ము సవాలుకు బాబుకు ధైర్యం ఉందా?

తాజాగా మాట్లాడిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు సంచలన సవాలు విసిరారు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 11:54 AM IST
కేశినేని దమ్ము సవాలుకు బాబుకు ధైర్యం ఉందా?
X

ఏపీలో ఎన్నికల వేడి ఎంతలా రాజుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకు చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కొత్త సంచలనాలకు వేదికగా మారుతున్నాయి. తాజాగా అలాంటి సన్నివేశమే ఒకటి విజయవాడలో చోటు చేసుకుంది. విపక్ష టీడీపీ ఎంపీగా అందరికి సుపరిచితమైన కేశినేని నాని ఇటీవల అధికార వైసీపీలోకి చేరటం తెలిసిందే.

తాజాగా మాట్లాడిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు సంచలన సవాలు విసిరారు. ఆయనకు దమ్ముంటే తనపై విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుప్పంలో ఓడిపోవటం ఖాయమన్న కేశినేని.. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో నిర్వహించిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానున్న ఎన్నికలే తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలుగా పేర్కొన్న ఆయన.. పేదల కోసం పని చేసే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అభివర్ణించారు. పేదలకు వ్యతిరేకంగ పాలన చేసిన చంద్రబాబు.. తన కొడుకు లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేయటమే ఏకైక ఎజెండాగా రాజకీయం చేస్తున్నారన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పే చంద్రబాబుకు ఏపీలో కనీసం ఇల్లు కూడా లేకపోవటం ఏమిటి? అని ప్రశ్నించారు.

జగన్ సర్కారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఐదేళ్ల పాలనలో రూ.2.60 లక్షల కోట్లను పేదలకు పంపిణీ చేసిందన్నారు. అదేసమయంలో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలోకి నిలవాలంటే అభ్యర్థులకు డబ్బులు ఉన్నాయా? లేదా? అన్నది చూసుకొని మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నట్లుగా మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా గడిచిన 57 నెలలుగా పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ.. జగన్ సర్కారు పని చేసిందన్న కేశినేని.. ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. మొత్తంగా కేశినేని నాని సవాలు విజయవాడ రాజకీయాల్ని మరింత వేడెక్కించేలా మారాయని చెబుతున్నారు.