Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్‌ దారిలో ఈ ఎంపీకి సవాళ్లివే!

అంతేకాకుండా వెనువెంటనే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ను కలవడం, తాజాగా వైసీపీ ప్రకటించిన జాబితాలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని సీటు కొట్టేయడం జరిగిపోయాయి.

By:  Tupaki Desk   |   12 Jan 2024 4:30 PM GMT
హ్యాట్రిక్‌ దారిలో ఈ ఎంపీకి సవాళ్లివే!
X

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెనువెంటనే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ను కలవడం, తాజాగా వైసీపీ ప్రకటించిన జాబితాలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని సీటు కొట్టేయడం జరిగిపోయాయి.

2009లో ప్రముఖ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో కేశినేని నాని చేరారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలుపొందారు. 2019లో కేవలం 8,726 ఓట్లతోనే విజయం సాధించారు.

2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున కూడా గెలుపొంది హ్యాట్రిక్‌ సృష్టిస్తానని కేశినాని నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి వైఎస్‌ జగన్‌ కు కానుకగా ఇస్తానని కేశినేని నాని చెబుతున్నారు.

అయితే కేశినేని నాని చెప్పినంత సులువు కాదని అంటున్నారు. వైసీపీకి కడప జిల్లా ఎలా కోర్‌ బెల్టో, టీడీపీకి విజయవాడ కూడా అలాగే కోర్‌ బెల్ట్‌. టీడీపీ ఏర్పాటయ్యాక విజయవాడ నుంచి అత్యధిక సార్లు గెలిచింది ఆ పార్టీవారే. ఈ నేపథ్యంలో కేశినేని నాని పార్టీ మారినంత మాత్రాన గతంలో ఓట్లేసినవారంతా ఆయనకే మళ్లీ ఓట్లేస్తారని అనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు.

అలాగే కేశినేని నాని తనతోపాటు టీడీపీ నేతలు.. ఎంకే బేగ్, బొమ్మసాని సుబ్బారావు, నల్లగట్ల స్వామిదాస్‌ తదితరులు వైసీపీలో చేరతారని ప్రకటించారు. కానీ ఒక్క నల్లగట్ల స్వామిదాస్‌ మినహా మరెవరూ చేరలేదు. అంతేకాకుండా తాము టీడీపీలోనే కొనసాగుతామని.. కేశినేని నానితో కలిసి నడిచేది లేదని వారు తేల్చిచెప్పారు. నల్లగట్ల స్వామిదాస్‌ కూడా తిరువూరులో టీడీపీ సీటు దక్కకే వైసీపీలో చేరారని చెబుతున్నారు. ఇప్పటికే తిరువూరులో టీడీపీ తరఫున శ్యామల దేవదత్‌ ఇంచార్జిగా ఉన్నారు.

మరోవైపు టీడీపీ తరఫున కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని ఎంపీగా పోటీ చేయడం ఖాయం. అంటే సొంత అన్నదమ్ముల మధ్యే ఎన్నికల వార్‌ జరగబోతోంది. కేశినేని చిన్నికి కూడా ఆర్థిక, అంగ బలాలు మెండు. ఇది కూడా కేశినేని నానికి సవాల్‌ గా మారనుందని అంటున్నారు.

కాగా రాజధాని ప్రాంతంలో కొలువై ఉన్న విజయవాడ నగరాన్ని విస్మరించి వైసీపీ సర్కార్‌ విశాఖపట్నం రాజధానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తోంది. ఇది కూడా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని నానికి ప్రతిబంధకంగా మారొచ్చని టాక్‌ నడుస్తోంది.

ఇక ఎంపీగా పలు అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో విజయవాడ నగరాభివృద్ధికి కేశినేని నాని ప్రయత్నించకపోవడం కూడా ఆయనకు సమస్యను సృష్టించే చాన్సు ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమిస్తేనే కేశినేని నాని మూడోసారి కూడా విజయం సాధించడానికి అవకాశం ఉందని చెబుతున్నారు.