Begin typing your search above and press return to search.

కేశినేని నాని ముందు ఆప్షన్లు అవేనా...!?

టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజకీయం ఏ మలుపు తీసుకుంటుంది అన్నది చర్చగా ఉంది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:30 PM GMT
కేశినేని నాని ముందు ఆప్షన్లు అవేనా...!?
X

టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజకీయం ఏ మలుపు తీసుకుంటుంది అన్నది చర్చగా ఉంది. ఆయన తెలుగుదేశంతో బంధాలు తెంచుకున్నారు. తన కుమార్తె శ్వేత చేత కూడా కార్పోరేటర్ పదవికి రాజీనమా చేయించారు. ఈ విషయంలో ఆయన పక్కా క్లారిటీ గా ఉన్నారు.

ఆ మీదట ఆయన ఏమి చేయబోతున్నారు అన్నది ఆసక్తిగా ఉంది. కేశినేని నాని టీడీపీ తరఫున రెండు సార్లు ఎంపీగా గెలిచినా ఆయనకంటూ సొంత బలం ఇమేజ్ ఉన్నాయన్నది అంతా ఒప్పుకుంటారు. ముక్కు సూటిగా సాగే రాజకీయ వ్యక్తిత్వం ఆయనది. కేశినేని నాని ఆ విధంగా ఉండటం వల్లనే రాజకీయంగా ఇబ్బందులు పడ్డారని అంటారు.

ఆయన వ్యక్తిత్వానికి సరిపడా చేరే పార్టీ ఏది అంటే బీజేపీ అనే అంతా చెబుతారు. జాతీయ పార్టీలో కేశినేని నాని ఉంటూ హుందాగా రాజకీయాలు చేయగలరు అని అంటారు. అయితే ఏపీ విషయంలో బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది. ఈ రోజుకు అయితే పొత్తులతోనే బీజేపీ ముందుకు సాగుతుంది అని అంటున్నారు.

ఇప్పటికే 2019 ఎన్నికల్లో ఒంటరి పోరుతో దెబ్బ తిన్న బీజేపీకి 2024 ఎన్నికలు చాలా ముఖ్యం. పైగా కేంద్రంలో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా ఎంపీలు కావాలి. దాంతో ప్రయోగాలు ఏవీ చేయకుండా పొత్తుల వైపే బీజేపీ చూస్తుంది అని అంటున్నారు. అదే జరిగితే ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరితే కేశినేని నాని ఆ పార్టీలో చేరినా ఉపయోగం లేదు అని అంటున్నారు.

ఏపీ వరకూ మళ్ళీ చంద్రబాబు మాటే నెగ్గుతుంది. ఆయన చెప్పిన వారే విజయవాడ ఎంపీ అభ్యర్ధి అవుతారు అలా చూస్తే నాని పార్టీ మారి టీడీపీకి మిత్ర పక్ష నాయకుడుగా మిగలాల్సి ఉంటుంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే నానికి సరైన ఆప్షన్ గా వైసీపీ ఉంది అని అంటున్నారు. వైసీపీలో ఆయన చేరికకు ద్వారాలు తెరచి ఉన్నాయా అంటే దాని మీద కూడా చర్చ సాగుతోంది. వైసీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఏమి ఆలోచిస్తోంది అన్నది చూడాల్సి ఉంది. ఈ రోజుకు అయితే హైకమాండ్ మదిలో విజయవాడ ఎంపీగా ఎవరు ఉన్నారు అన్నది తెలియడంలేదు అంటున్నారు

విజయవాడ నుంచి రెండు సార్లు వైసీపీ ఓటమి పాలు అయింది. ఈసారి గట్టి అభ్యర్ధిని పెట్టాలని కూడా ఆలోచన ఉంది. బీసీలకు టికెట్ ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక వైసీపీ వ్యూహాలు చూస్తే కేశినేని నాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కచ్చితంగా టీడీపీ ఓట్లు చీలుస్తారని అది తమకు ప్లస్ అవుతుందని కూడా లెక్కలేస్తోంది.

అదే కేశినేని నాని వైసీపీలో చేరితే టీడీపీతో డైరెక్ట్ ఫైట్ గానే ఉంటుంది అని అంటున్నారు ఏ విధంగా చూసుకున్నా వైసీపీ అయితే అనేక రకాలుగానే విజయవాడ ఎంపీ సీటు మీద ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కేశినేని నాని ఇండిపెండెంట్ గా పోటీ చేయడం వరకూ మాత్రమే ఆయన చేతిలో ఉంది అని అంటున్నారు. మిగిలినవి మాత్రం జరగాలి అంటే సమీకరణలు చాలా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.