Begin typing your search above and press return to search.

బాబు వేస్ట్, లోకేష్ ఆఫ్ట్రాల్... కేశినేని నానీ సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు

By:  Tupaki Desk   |   10 Jan 2024 12:15 PM GMT
బాబు వేస్ట్, లోకేష్ ఆఫ్ట్రాల్... కేశినేని నానీ సంచలన వ్యాఖ్యలు!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేశినేని నానితోపాటు అయోధ్య రామిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాశ్, మొండితోక అరుణ్.. ఆయనతోపాటు క్యాంప్ కార్యాలయానికి వెళ్లినవారిలో ఉన్నారు.

అవును.. చాలామంది భావించినట్లుగానే విజయవాడ ఎంపీ కేశినేని నానీ.. సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. తన ఎంపీ రాజీనామా ఆమోదం అనంతరం వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. జగన్ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేపడతానని తెలిపారు. ఈ సందర్హంగా మీడియాతో మాట్లాడిన కేశినేని నాని.. చంద్రబాబు, లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేశారు.

ఇందులో భాగంగా గత నాలుగో తేదీనుంచి జరుగుతున్న పరిణామాలన్నీ అందరికీ తెలుసని మొదలుపెట్టిన నానీ... నాడు ఎంపీ స్థానానికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. 2013 జనవరి 21న కృష్ణాజిల్లాలోకి చంద్రబాబు పాదయాత్ర వస్తుంటే... 2013 జనవరి 16 నుంచి విజయవాడ ఇన్ ఛార్జ్ గా, అభ్యర్థిగా తనను ప్రకటించారని, నాటి నుంచి టీడీపీ కోసం అలుపెరగకుండా కష్టపడుతున్నట్లు నానీ తెలిపారు.

ఇదే సమయంలో నాడు చంద్రబాబు "మీ కోసం" పాదయాత్ర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్నీ తన భుజాలపై మోసినట్లు చెప్పిన నాని... చంద్రబాబును గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేసి కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు గెలిచి 2014లో అధికారంలోకి కూడా వచ్చామని గుర్తు చేశారు. ఆ సమయంలోనే చంద్రబాబు వెంట తిరగొద్దని తన సామాజికవర్గ నేతలే చెప్పారని నాని తెలిపారు.

ఇక 2019 ఎన్నికల్లో తాను విజయవాడ ఎంపీగా గెలిస్తే... అన్ని రిసోర్సులూ ఇచ్చినప్పటికీ ఆ ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయాడని గుర్తుచేశారు నాని. ఈ రెండుసార్లూ తాను ఏనాడూ చంద్రబాబు వద్ద రూపాయి కూడా తీసుకోకుండా గెలిచినట్లు నాని తెలిపారు. అయినప్పటికీ చాలామంది మనుషులను పెట్టి తనను అవమానపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో కేశినేని నానీని చెప్పుతో కొట్టిస్తానని ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్ తో చంద్రబాబే చెప్పించారని.. అదే ప్రెస్స్ మీట్ లో ఒక పోలిట్ బ్యూర్ సభ్యుడు తనను గొట్టంగాడు అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు పెట్టిన ఆ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చెల్లాచెదురైపోయిందని నాని తెలిపారు. అనంతరం తనతో ప్రచారానికి రావొద్దని స్వయంగా చంద్రబాబే తెలిపారని కేశినేని నాని అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసని, కానీ ఇంత పచ్చి మోసగాడని మాత్రం తనకు ఇప్పుడే తెలిసిందని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో... చంద్రబాబు అసలు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేని వ్యక్తి అని.. జగన్ నిరుపేదల పక్షపాతి అని కేశినేని నాని కీలక స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఈ సమయంలో తాను జగన్ తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపిన నాని... ఎంపిగా తన రాజీనామా ఆమోదం తర్వాత వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అనంతరం జగన్ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ ప్రకారం నడుచుకుంటానని అన్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో 60శాతం తెలుగుదేశం పార్టీ ఖాళీ అవబోతుందంటూ నానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక ఓడిపోయిన మంగళగిరీ ఎమ్మెల్యే.. ఆఫ్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తే తాను ఏ విధంగా పాల్గొంటానని ప్రశ్నించిన నానీ... అసలు లోకేష్ ఏ అర్హతతో పాదయాత్ర చేశాడని ప్రశ్నించారు. లోకేష్ గెలిచిన ఎమ్మెల్యేనా, ఎంపీనా... ఏ ప్రోటోకాల్ తో తాను అతడి పాదయాత్రలో పాల్గొనాలని పునరుధ్ఘాటించారు. ఇక ఏ హక్కుతో సీనియర్లను శాసిస్తున్నాడో లోకేష్ చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో, ప్రధానంగా ఉమ్మడి కృష్నాజిల్లా రాజకీయాల్లో కేశినేని నానీ ప్రెస్స్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.