Begin typing your search above and press return to search.

ఆ వార్తలు చదివాక జగన్‌ పై అనుమానమొచ్చింది: కేశినేని సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో వైసీపీ ఆయన పార్టీలో చేరడం ఆలస్యం వెనువెంటనే విజయవాడ తమ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేసింది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 9:45 AM GMT
ఆ వార్తలు చదివాక జగన్‌ పై అనుమానమొచ్చింది: కేశినేని సంచలన వ్యాఖ్యలు!
X

విజయవాడ టీడీపీ ఎంపీ సీటును తనకు కాకుండా తన తమ్ముడు కేశినేని చిన్నికి కేటాయించడంతో సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఆయన పార్టీలో చేరడం ఆలస్యం వెనువెంటనే విజయవాడ తమ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేసింది.

ఈ నేపథ్యంలో నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ లపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఆసరా వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియాను లక్ష్యంగా చేసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లో మీడియాలో జగన్‌ పై వస్తున్న వార్తలు చూసి అవి నిజమేనని అనుకున్నానన్నారు.

అయితే వైసీపీలో చేరిన తర్వాత వైఎస్‌ జగన్‌ నిబద్ధత ఏమిటో తనకు అర్థమైందని కేశినేని నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలను చదివి జగన్‌ పై అనుమానం వచ్చిందని, అయితే వైసీపీలో చేరి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత జగన్‌ నిబద్ధత ఉన్న నాయకుడని తెలిసిందన్నారు.

ఎక్కడో మారుమూల గుంతలు పడిన రోడ్లను ఫొటోలు తీసి ఎల్లో మీడియాలో పెద్దగా ప్రచురిస్తున్నారని కేశినేని నాని ధ్వజమెత్తారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అన్ని చోట్లా రోడ్లు బాగున్నాయన్నారు.

జగన్‌ పేదల అభ్యున్నతికి, సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని.. ఆయన మాదిరిగానే తాను కూడా ప్రజలకు సేవలందిస్తారని వెల్లడించారు.

కరోనా సంక్షోభంలోనూ ఉద్యోగుల జీతాలు ఆగిపోలేదని, అలాగే సంక్షేమ పథకాలు ఏవీ నిలిచిపోలేదని ఎంపీ కేశినేని నాని గుర్తు చేశారు. తాను ఎన్నో దేశాలకు వెళ్లానని.. అయితే జగన్‌ లాంటి గొప్ప నాయకుడిని చూడలేదని తెలిపారు. ఈ మాటలన్నీ తన హృదయం నుంచి వస్తున్నవే అని నాని స్పష్టం చేశారు.

బూటకపు వాగ్దానాలకు అలవాటు పడిన చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రతికూల ప్రచారం చేస్తున్నారని కేశినేని నాని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేశినేని నాని.. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్‌ పై ప్రశంసలు కురిపించారు.

అవినాష్‌ చేసిన అవిశ్రాంత ప్రయత్నాల వల్లే కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ సాకారమైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అవినాష్‌ 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ అభివృద్ధికి తానే కారణమని కేశినేని నాని తెలిపారు. కేంద్రం నుంచి ఎన్నో నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేశానన్నారు.

చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని.. ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన హైదరాబాద్‌ పారిపోతారని కేశినేని ఎద్దేవా చేశారు. పేదల కోసం జగన్‌ పనిచేస్తుంటే.. ధనికుల కోసం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం జగన్‌ లా పనిచేసేవారు దేశంలోనే ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.