అక్కడ ఓడితే రాజకీయ సన్యాసమే!
ఏపీ ఎన్నికల్లో తాము ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని పలువురు అభ్యర్థులు బహిరంగంగానే సవాళ్లు విసిరారు.
By: Tupaki Desk | 11 Jun 2024 4:52 AM GMTఏపీ ఎన్నికల్లో తాము ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని పలువురు అభ్యర్థులు బహిరంగంగానే సవాళ్లు విసిరారు. ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తామన్న అభ్యర్థుల ఇళ్ల ముందు టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్చిన మాటను నిలుపుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు ఇలాంటి సవాళ్లు ఏవీ లేని విజయవాడ లోక్ సభా నియోజకవర్గంలో మాత్రం ఓడిన అభ్యర్థులకు రాజకీయ సన్యాసం తప్పడం లేదు. విజయవాడ ఎంపీగా 2004, 2009లో కాంగ్రెస్ తరఫున లగడపాటి రాజగోపాల్ గెలుపొందారు. అయితే ఆయన ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. తెలంగాణ రాదని.. వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తెలంగాణ సాకారం కావడంతో రాజకీయ సన్యాసం ప్రకటించారు.
ఇక 2014లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీగా కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక మళ్లీ ఒక్కసారి కూడా రాజకీయాల్లో కనిపించలేదు. రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.
ఇక 2019లో ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ విజయవాడ నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆయన కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారు. ఓడాక ఒక్కసారి కూడా క్రియాశీలక రాజకీయాల్లో పాలుపంచుకోలేదు.
2014, 2019ల్లో టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. అయితే పరాజయం పాలయ్యారు. దీంతో ఆయన రాజకీయ సన్యాసం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికార ప్రకటన చేశారు.
తద్వారా లగడపాటి రాజగోపాల్, కోనేరు రాజేంద్ర ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్ బాటలోనే కేశినేని నాని కూడా నడవనున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలకు వైసీపీ మరోసారి కొత్త అభ్యర్థిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు విజయవాడ ఎంపీ స్థానంలో వైసీపీ ఖాతా తెరవలేదు. 2014, 2019, 2024.. ఇలా మూడు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు బరిలోకి దిగినా గెలుపు సాధించలేకపోయారు.