Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు.. మీడియా ఏం పీకింది?: ఎంపీ ఫైర్‌

మీడియాను తాను పట్టించుకోన‌ని కేశినేని నాని వ్యాఖ్యానించారు. "రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది.

By:  Tupaki Desk   |   5 Jan 2024 3:22 PM GMT
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు.. మీడియా ఏం పీకింది?:  ఎంపీ ఫైర్‌
X

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని మీడియాపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఒక నాయ‌కుడి గురించి మీడియా దుష్ప్ర‌చారం చేసినంత మాత్రాన ఏమీ జ‌ర‌గ‌ద‌ని ఆయ‌న అన్నారు. తాజాగా విజ‌య‌వాడ ఎంపీ సీటును టీడీపీ వేరేవారికి కేటాయించిన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై మీడియా ఆయ‌న‌ను సంప్ర‌దించింది. ఈ స‌మ‌యంలో మీడియాపై ఎంపీ ఫైర్ అయ్యారు. "మీడియాకు కావాల్సింది మసాలెనేగా. తినబోతూ రుచులెందుకు, అన్ని విషయాలు ఒకే రోజెందుకు?" అని వ్యాఖ్యానించారు.

మీడియాను తాను పట్టించుకోన‌ని కేశినేని నాని వ్యాఖ్యానించారు. "రేవంత్ రెడ్డి దొంగ అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. ఈ విష‌యంలో దుష్ప్ర‌చారం చేసిన మీడియా రేవంత్‌రెడ్డిని ఏం పీకగలిగింది" అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం టీడీపీ ఎంపీ టికెట్‌పై తాను ఏమీ మాట్లాడ‌బోన‌న్నారు. ఎవ‌రికి ఇచ్చినా సంతోష‌మేన‌ని చెప్పారు. 2024 మే వరకూ తానే విజయవాడ ఎంపీనని చెప్పారు.

"నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారు. గొడవలు పడటం నా నైజం కాదు, అంతమాత్రాన అది చేతకానితనం కాదు" అని నాని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. మూడోసారి విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తానని ఎంపీ చెప్పారు. అయితే.. అది ఏ పార్టీ అనేది తాను చెప్ప‌బోన‌న్నారు. ఎంపీ టికెట్‌ను విమానం టికెట్‌తో పోల్చిన నాని.. "ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి. ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోయితే ప్రైవేట్ జెట్‌లో అయినా వెళ్ళాలి కదా" అని అన్నారు.

తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని.. పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిన్నారు. "నేను వద్దని చంద్రబాబు అనుకున్నారని... నేను అనుకోలేదు. నా మీద, విజయవాడ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పాను. నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది" అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.