బుద్ధా వెంకన్న సీటుకు నైస్ గా ఎసరు పెడుతున్నదెవరు...?
By: Tupaki Desk | 3 Sep 2023 11:30 PM GMTవిజయవాడ టీడీపీ రాజకీయాలను వేడెక్కించే పనిలో ఫుల్ బిజీ అవుతున్నారు ఎంపీ కేశినేని నాని. తాను ఎంపీగా మళ్లీ పోటీ చేస్తాను. నేనంటే నేనే అంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసిన కేసినేని నాని ఇపుడు తన పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్ధిలను కూడా తానే స్వయంగా ఎంచుకుంటున్నారు. తన అనుకూలులను ఎమ్మెల్యే అభ్యర్ధులుగా ముందు పెట్టి వారిని గెలిపిస్తూ తాను గెలవాలని ఆయన చూస్తున్నారు.
అదే సమయంలో బెజవాడ రాజకీయాల్లో ఎంపీ కేశినేనిని గట్టిగా వ్యతిరేకిస్తున్న కీలక నాయకుల సీట్లు ఈ వ్యూహంలో ఎగిరిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేశినేని టార్గెట్ ముందుగా విజయవాడ పశ్చిమకు చెందిన సీటు మీద పడింది. ఎవరు అడ్డు వచ్చినా ఈ సీటు నుంచి తన మనిషిని టీడీపీ అభ్యర్ధిగా 2024 ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకుంటాను అని ఒక చాణక్య శపధం చేసేసారు కేశినేని నాని.
ఈ సీటు మీద ఎంతో ఆశ పెట్టుకుని బుద్ధా వెంకన్న పనిచేస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్ట సభలో తిరిగి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బుద్ధా వెంకన్న కేశినేని నానిల మధ్య విభేదాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతాయి.
దాంతో ఇపుడు ఏకంగా బుద్ధా వెంకన్న ఆశల మీదనే నీళ్ళు చల్లే ప్రయత్నం నాని చేస్తున్నారు అని అంటున్నారు. ఇక బుద్ధా వెంకన్న సీటుని తన మనిషిగా భావిస్తున్న బేగ్ ను రంగంలోకి దింపి గెలిపించుకుంటాను అని ఆయన అంటున్నారు. ఎవరడ్డొచ్చినా ఈ సీటు నుంచి బేగ్ నే గెలిపిస్తాను అంటున్నారు నాని. ఇక్కడ ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. ఈ సీటు నుంచి గతంలో వారు గెలిచారు అలాగే టీడీపీలో ఇపుడు నాగుల్ మీరా ఈ సీటుని ఆశిస్తున్నారు.
మరో వైపు చూస్తే ఈ సీటు విషయంలో బుద్ధా వెంకన్న గట్టిగానే పట్టుబడుతున్నారు అని తెలుస్తోంది. అయితే ఎంపీ అభ్యర్ధిగా ఉన్న వారికి కొంత చాయిస్ ఉంటుందని అంటున్నారు. వారే అంగబలం అర్ధబలం విషయంలో సమకూర్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారి మాటకు కొంత విలువ ఉంటుందని అంటున్నారు. అలా తన పవర్ ని ఉపయోగించి తన మనిషిని బుద్ధా వెంకన్న సీటులోకి దింపడం ద్వారా గట్టి షాక్ ఇచ్చేందుకు కేశినేని నాని రెడీ అయ్యారు అంటున్నారు.
విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి తనను కాకుండా తన తమ్ముడు చిన్నిని పోటీగా దించి తనను ఇబ్బంది పెట్టాలని చూసిన సొంత పార్టీలోని ప్రత్యర్ధులకు సరైన ఝలక్ ఇచ్చేందుకు కేశినేని నాని పక్కా స్కెచ్ తో ఉన్నారని అర్ధమవుతోంది. మరి బుద్ధా వెంకన్న బీసీ వర్గానికి చెందిన వారు. టీడీపీ అధినాయకత్వానికి బాగా కావాల్సిన వారు. ఆయన మాట నెగ్గుతుందా లేక కేశినేని నాని పట్టుదల గెలుస్తుందా అన్నది చూడాలి మొత్తానికి చూస్తే విజయవాడ టీడీపీ రాజకీయాన్ని టోటల్ గా చేంజి చేసేందుకే నాని చూస్తున్నట్లుగా తెలుస్తోంది అంటున్నారు.