Begin typing your search above and press return to search.

విజయవాడ టీడీపీకి కేశినేని సెగ...!?

అంశం ఇపుడు టీడీపీలో చిచ్చు రేపుతోంది. కేశినేని నాని మామూలుగా అయితే ఒకే కానీ ఆయనను కెలికితే మాత్రం ఇబ్బందే అని అంటారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 2:30 AM GMT
విజయవాడ టీడీపీకి కేశినేని సెగ...!?
X

న్యూ ఇయర్ ని సందర్భంగా చేసుకుని చాలా మంది నేతలు కొత్త ఏడాది తొలి రోజు మీడియా ముందుకు వచ్చారు. మరి కొందరు మీటింగులు కూడా పెట్టారు. ఈ సందర్భాంగా వారు గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని విశ్లేషించుకున్నట్లుగా మాట్లాడుతూ తమ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్న దాన్ని తెలివిగానే జనాలకు చేరవేశారు. అది మరో విధంగా చూస్తే అధినాయకత్వానికి కూడా చేరవేయాలన్నదే అసలైన ఉద్దేశ్యం.

విజయవాడ టీడీపీలో వర్గ పోరు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అది మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఇక విజయవాడ ఎంపీగా రెండు సార్లు గెలిచిన కేశినేని నాని మూడవసారి తానే పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే అధినాయకత్వం మాత్రం ఆయన తమ్ముడి కేశినేని చిన్నిని బరిలోకి దించాలని చూస్తోంది.

ఇక కేశినేని చిన్నికి నారా లోకేష్ బ్లెస్సింగ్స్ పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇటీవలనే లోకేష్ చిన్నిని పిలిపించుకుని మరీ అన్ని విషయాలు ముచ్చటించారు అని వార్తలు వచ్చాయి. విజయవాడ ఎంపీగా 2024లో చిన్నికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చిన్ని సైతం ఆ దిశగానే సంకేతాలు ఇస్తూ తన పని తాను చేసుకుని పోతున్నారు.

ఇదే అంశం ఇపుడు టీడీపీలో చిచ్చు రేపుతోంది. కేశినేని నాని మామూలుగా అయితే ఒకే కానీ ఆయనను కెలికితే మాత్రం ఇబ్బందే అని అంటారు. ఆయన ఒక్కటే చెబుతున్నారు తన కుటుంబాన్ని విడదీసి తన తమ్ముడినే ప్రత్యర్ధిగా చేసి పోటీకి దించితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా గతంలో అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

విజయవాడ ఎంపీ టికెట్ విషయంలో కేశినేని వాదన ఏంటి అంటే ఆయన 2019లో కూడా రెండవసారి గెలిచారు జగన్ వేవ్ లో సైతం విజయం సాధించిన ముగ్గురు ఎంపీలలో ఆయన ఒకరు. అలాంటిది ఆయనను కాదని ఓడిపోయిన నేతలకు ప్రాధాన్యతను పార్టీ ఇస్తోంది అన్నదే ఆయన బాధ. ఇక ఆయన కుమార్తెను విజయవాడ మేయర్ గా నిలబెడితే ఆమెను సొంత పార్టీ వారే ఓడించారు అన్నది మరో బాధ.

ఇవన్నీ కలసి ఆయనకు టికెట్ ఇవ్వకపొతే ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చర్చకు వస్తోంది. తనకు విజయవాడ పరిధిలో మొత్తం 16 లక్షల మంది ఓటర్ల పూర్తి మద్దతు ఉందని న్యూ ఇయర్ వేళ నాని ప్రకటించారు. తన కుటుంబం విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తుంది అని జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన తిప్పికొట్టారు.

అసెంబ్లీకి తాము పోటీ చేయమని కూడా క్లారిటీ ఇచ్చారు. అదే టైం లో విజయవాడ పార్లమెంట్ సీటుకు తాను కాపలాదారుడిని అని చెప్పుకున్నారు. ఈ మాటలను బట్టి చూస్తూంటే ఆయన టికెట్ కోసం గట్టిగానే ఉన్నారని అంటున్నారు. కేశినేని నానికి కాకుండా చిన్నికి టికెట్ ఇస్తే మాత్రం అసలు ఊరుకునే ప్రసక్తి లేదని అంటున్నారు.

దాంతో ఆయన ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక నానికి మంచి పరిచయాలు ఉన్నాయి. వైసీపీ నేతలతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వ్యవహారం అటు ఇటు తిరిగి ఏ రకంగా కొంప ముంచుతుందో అన్న కలరవం అయితే విజయవాడ టీడీపీలో ఉంది.

ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడే నానికి హై కమాండ్ కి మధ్య ఉన్న గ్యాప్ పెరిగి పెద్దది అయింది. దాన్ని పూడ్చే చాన్స్ ఉందా అన్నదే ఇక్కడ పాయింట్. నాని ఫ్యామిలీకి అసెంబ్లీ టికెట్ ఇచ్చి చిన్నిని ఎంపీ అభ్యర్ధిగా ప్రకటిస్తారా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. అయితే తమ కుటుంబం అసెంబ్లీకి పోటీ చేయదు అని నాని ముందే చెప్పడంతో అన్నదమ్ముల పోటీ ఎంపీ సీటు కోసమే అంటున్నారు. మరి ఇది ఎన్నికల వేళ టీడీపీకి అతి పెద్ద సెగనే రగిల్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.