చంద్రబాబుకు బిగ్ షాక్ .. కేశినేని నాని సంచలన నిర్ణయం!
ఎన్నికల ముంగిట టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని లె లుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.
By: Tupaki Desk | 6 Jan 2024 4:47 AM GMTఎన్నికల ముంగిట టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని లె లుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు.
తన లోక్ సభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. దీంతో విజయవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
కాగా, కేశినేని నాని ట్విట్టర్ వేదికగా.. ‘‘చంద్రబాబు నాయుడుగారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను’’ అని పోస్టు చేశారు.
కేశినేని నాని నిన్న మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ తిరువూరులో నిర్వహించనున్న సభకు తనను రావొద్దన్నారని బాంబుపేల్చారు. తాను వెళ్లడం లేదని.. తన మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసన్నారు. అలాగే అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసన్నారు. తాను టీడీపీ పార్టీకి ఓనర్‌ను కాదన్నారు. అయితే చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతానన్నారు. తినబోతూ రుచులెందుకు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని హాట్ కామెంట్స్ చేశారు. కాలమే అన్నింటిని నిర్ణయిస్తుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు తనకు ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారన్నారు.
తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డానని కేశినేని నాని తెలిపారు. కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదన్నారు. చంద్రబాబుకి తాను వెన్నుపోటు పొడవలేదని.. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమోనన్నారు.
తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తానని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయంలో సందేహం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయవాడ నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. కచ్చితంగా మూడో సారి గెలుస్తానన్నారు.
కాగా కేశినేని నాని 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటును చంద్రబాబు.. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి కేటాయించారని చెబుతున్నారు. అన్నదమ్ములయిన కేశినేని నాని, చిన్నిల మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా తిరువూరులో ఇరు వర్గాలు తన్నులాటకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు.