కేశినేని భవన్ ఖాళీ.. ఏం జరిగిందంటే!
ఇక, పార్టీకి కూడా త్వరలోనే రాజీనామా చేస్తానని ఆమె కూడా ప్రకటించారు. ఇదిలావుంటే..నిత్యం టీడీపీ నాయకులతో కళకళలాడే కేశినేని భవన్ తాజాగా ఖాళీ అయింది.
By: Tupaki Desk | 10 Jan 2024 4:36 AM GMTవిజయవాడ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నాయకుడు కేశినేని నాని.. ఆ పార్టీతో వివాదాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని.. అనంతరం.. పార్టీకి కూడా గుడ్‌బై చెబుతానని ఆయన చెప్పారు. ఈ క్రమంలో తన కుమార్తె కేశినేని శ్వేత కూడా తన కార్పొరేటర్ పదవికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. ఇక, పార్టీకి కూడా త్వరలోనే రాజీనామా చేస్తానని ఆమె కూడా ప్రకటించారు. ఇదిలావుంటే..నిత్యం టీడీపీ నాయకులతో కళకళలాడే కేశినేని భవన్ తాజాగా ఖాళీ అయింది.
విజయవాడ నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో బందరు రోడ్డుపై పోలీసు కంట్రోల్‌రూమ్‌కు పక్కనే కేశినేని భవన్ ఉంది. కేశినేని నాని ఎంపీ అయ్యాక.. దీనినే ఆయన కార్యాలయం గా మార్చుకున్నారు. ఇక్కడే పార్టీ కార్యక్రమాలు.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాలుగు అంతస్థుల భవనంలో నాయకులకు బస కూడా ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలకే కాకుండా.. కార్యకర్తల సమావేశాలకు కూడా ఈ కార్యాలయాన్నే వినియోగిస్తుంటారు. అయితే.. ఇప్పుడు టీడీపీతో విబేదించిన నాని.. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు.
కేశినేని భవన్ నాలుగు అంతస్థులపై నుంచి పెద్ద ఎత్తున టీడీపీ జెండాలతో కూడిన హోర్డింగులు ఉన్నాయి. ఒకవైపు చంద్రబాబు నిలువెత్తు ఫొటోలు.. మరోవైపు.. పార్టీ జెండా మధ్యలో కేశినేని నాని, ఆయన కుమార్తెల ఫొటోలను వేలాడ దీశారు. వీటిని ఇప్పుడు కార్మికులను పెట్టి తీయించేశారు. మరోవైపు.. 2 వేలకుపైగా పసుపు రంగు కుర్చీలను కూడా షామియానా దుకాణానికి అమ్మేశారు. ఇక, పార్టీ జెండాలను తీసేశారు. ఈ ఖాళీ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను కేశినేని నాని అనుచరులు సోషల్ మీడియాలో పెట్టారు.