జగన్ రీ-వెరిఫికేషన్... కేశినేని నాని స్థానంలో మరో నేత!?
ఈ సమయంలో ఇప్పటికే మార్పులు చేర్పులు చేపట్టిన ఇన్ ఛార్జ్ లలో కూడా మరికొన్ని మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.
By: Tupaki Desk | 31 Jan 2024 12:58 PM GMTగతంలో ఎన్నడూ లేదన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇప్పటికే భారీ స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీలో కొన్ని ఒడిదుడుకులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే మార్పులు చేర్పులు చేపట్టిన ఇన్ ఛార్జ్ లలో కూడా మరికొన్ని మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.
అవును... సామాజిక సమీకరణలు, సర్వేల ఫలితాలు, కార్యకర్తల అభిప్రాయాలు, నేతల పనితీరు మొదలైన పరామితులను పరిగణలోకి తీసుకుంటున్న జగన్ పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు, మరికొన్ని సమీకరణల నేపథ్యంలో... ఇప్పటికే మార్పులు చేర్పులు చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మరోసారి ఇన్ ఛార్జ్ ల మార్పులు చేస్తున్నారు జగన్! ఇందులో భాగంగా అరకు అసెంబ్లీతో పాటు విజయవాడ లోక్ సభ స్థానంలోనూ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
వాస్తవానికి ఇటీవల అరకు సిటింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ స్థానంలో అరకు ఎంపీ మాధవిని ఇన్ చార్జి గా నియమించారు. అయితే ఈ ఎంపికపై స్థానిక నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడం.. ఆమె నాన్ లోకల్ అంటూ పెద్దఎత్తున ఆందోళనకు దిగడం చేశారు! ఈ సమయంలో... ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ కల్పించుకుని స్థానిక నేతలతో చర్చలు జరిపినప్పటికీ వారు కూల్ అవ్వలేదు! ఇందులో భాగంగా తమకు స్థానిక అభ్యర్థిని ఎంపకచేయాలని కోరారు.
దీంతో పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తుంది. దీంతో... సిట్టింగ్ ఎంపీ గొడ్టేటి మాధవిని తప్పించి.. ఆమె స్థానంలో అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా రాగం మత్సలింగంను అధికారిక అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో... ఆ సమస్య అక్కడితో శాంతించిందని చెబుతున్నారు. ఇదే క్రమంలో... కేశినేని నాని విషయంలో కూడా మార్పులు తప్పకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే.. అందుకు గల కారణాలు మాత్రం వేరని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో... కేశినేనికి బెజవాడ లోక్ సభ టిక్కెట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించారు! అయితే... తాజాగా చేయిస్తున్న సర్వేల్లో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి! ఇందులో భాగంగా... ఈసారి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలో మొండితోక అరుణ్ కుమార్ పేరుతో పార్టీ సర్వే చేయిస్తోందని తెలుస్తుంది. అది సక్సెస్ అయ్యి మార్పు అనివార్యమైతే... కేశినేని నానిని ఎంపీ సీటు బదులు ఆయన కుమార్తె శ్వేతకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగా విజయవాడ ఎంపీసీటు పరిధిలోని పలు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మరోపక్క... కేశినేని చిన్నికి ఈసారి ఎంపీ సీటు కాకుండా.. ఆ టిక్కెట్ గద్దె రామ్మోహన్ కి ఇస్తారని.. చిన్నికి మరోచోట అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారని చర్చ జరుగుతున్న వేళ... బాబాయ్ - అమ్మాయ్ తలపడతారేమో అనే చర్చ మొదలైంది.