తూర్పు గెలుపు అవినాష్ కన్నా కేశినేనికే ప్రెస్టేజా..!
ఇటీవల టీడీపీ నుంచి వచ్చి వైసీపీ లో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అవినాష్ కన్నా ఎక్కువగా ఆయన ప్రచారం చేస్తున్నారు.
By: Tupaki Desk | 18 Jan 2024 5:30 PM GMTవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జ్‌గా దేవినేని అవినాష్ చౌదరి ఉన్నారు. ఈయనకు టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గం లో యువ నాయకుడిగా అవినాష్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొండ ప్రాంతాల్లోని వారి చిరకాల డిమాండ్ అయిన.. పట్టాలు కూడా ఇప్పించారు. రోడ్లు వేయించారు. నియోజకవర్గంలో ఉదయాన్నే పర్యటిస్తూ.. ఇక్కడి వారిని ఆకర్షిస్తున్నారు. తన తండ్రి స్నేహితులను కూడా కలుస్తున్నారు.
సో.. అవినాష్ ప్రయత్నాలుముమ్మరంగానే సాగుతున్నాయి. అయితే.. ఇటీవల టీడీపీ నుంచి వచ్చి వైసీపీ లో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అవినాష్ కన్నా ఎక్కువగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా వివిధ వర్గాలతో సమావేశాలు పెట్టి మరీ.. ఆయన అవినాష్‌ను వెంటబెట్టుకుని తీసుకువెళ్తున్నారు. ఆయా వర్గాలకు పరిచయం చేస్తున్నారు. ఈ దఫా.. అవినాష్ ను గెలిపించి తీరాలని ఆయన విన్నవిస్తున్నారు.
విజయవాడ ఆటోనగర్ పరిధి.. ఈ నియోజకవర్గంలోనే ఉంది. అదేవిధంగా ప్రముఖ వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలు కూడా.. తూర్పు నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో ఆయా వర్గాల వారితో ఎంపీ నాని విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. లారీ ఓనర్స్ అసోసియేషన్, పారిశ్రామిక వర్గాల సంఘం, అదేవిధంగా మాల్స్ యజమానుల సంఘాలతో విడివిడిగా నిర్వహించిన సమావేశాల్లో అవినాష్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
మంచి నాయకులు ఎందరో ఉంటారని(పరోక్షంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను ఉద్దేశించి), కానీ, పనిచేసే నాయకులు కావాలని నాని చెబుతున్నారు. తనకు ఎలాంటి అధికారం, పదవి లేకపోయినా.. అవినాష్ ఆటోనగర్ లో రోడ్లు వేయించారని.. తన కార్యాలయం ముందు.. రెండేళ్ల కిందట అసలు రోడ్డే లేదని.. కానీ, తర్వాత అవినాష్ ఇక్కడ రోడ్డు వేయించడం చూసి ఆశ్చర్య పోయానని చెప్పుకొచ్చారు. మొత్తంగా.. అవినాష్‌ను గెలిపించాలనే లక్ష్యంతో నాని ముందుకు సాగుతున్నారు.
దీనికి ప్రధాన కారణం.. సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గద్దె రామ్మోహన్.. తనను విబేదిస్తున్నారనే వాదన ఉంది. గతంలోనూ బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ విషయంలో గద్దెతో నాని విభేదించారు. ఈ నేపథ్యంలో ఆయనను తప్పించి.. ఈ సీటును తనకుమార్తెకు ఇప్పించుకోవాలని నాని ప్రయత్నించారు. కానీ, టీడీపీలో అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కకపోయినా.. ఇక్కడ గద్దెను ఓడించాలనేది నాని లక్ష్యంగా ఉంది. అందుకే అవినాష్ కన్నా ఎక్కువగా ఆయన ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.