కేతిరెడ్లకు కుదరని రాజకీయం
కేతిరెడ్డి పెద్దారెడ్డి బాబాయ్ అయితే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అబ్బాయి. ఈ ఇద్దరూ వైసీపీలో ఎంతో కీలకంగా ఉండేవారు.
By: Tupaki Desk | 10 March 2025 3:00 AM ISTఉమ్మడి అనంతపురం జిల్లాలో కేతిరెడ్ల రాజకీయం పారడంలేదు. వైసీపీ అధికారంలో ఉన్న రోజులలో ఒక వెలుగు వెలిగి హవా చాటుకున్న కేతిరెడ్డి బాబాయ్ అబ్బాయిలకు ఇపుడు అంతా రివర్స్ లో సాగుతోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి బాబాయ్ అయితే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అబ్బాయి. ఈ ఇద్దరూ వైసీపీలో ఎంతో కీలకంగా ఉండేవారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్ లా ఇలాకా అయిన తాడిపత్రిలో 2019లో గెలిచారు. తాడిపత్రిలో జేసీలను ఓడింబ్చి జెయింట్ కిల్లర్ గా మారారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన దూకుడు వేరే లెవెల్ లో సాగింది. ఎంతలా అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ అక్కడ ఆయన చేసిన హడావుడి అప్పట్లో రాజకీయ రచ్చకు దారి తీసింది. అయితే చేతిలో అధికారం ఉంది కాబట్టి అంతా చెల్లుబాటు అయింది.
అయితే 2024లో అధికారం పోగానే పెద్దారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఆయనను తాడిపత్రి నుంచి దూరం పెట్టడంలో జేసీ ఫ్యామిలీ విజయం సాధించారు. అటు పెద్దారెడ్డి ఇటు జేసీల ఫ్యామిల మధ్య రాజకీయ కక్షలు కార్పణ్యాలతో తాడిపత్రి మండిపోతోంది అని కొన్నాళ్ళ పాటు ఎవరూ తాడిపత్రిలోకి అడుగుపెట్టవద్దు అని పోలీసులు ఆదేశించారు.
అయితే కొన్నాళ్ళ తరువాత జేసీ ఫ్యామిలీకి మినహాయింపు ఇచ్చారు. దాంతో ఎమ్మెల్యే హోదాలో అస్మిత్ రెడ్డి అలాగే తాడిపత్రి చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి తమ సొంత ఇలాకాలో బాగానే తిరుగుతున్నారు. కానీ పెద్దారెడ్డి మీద పెట్టిన ఆంక్షలు అలాగే ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలో పెద్దారెడ్డి తన సొంత నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేకపోయారు.
ఆయన ఎంతలా రావాలని చూస్తున్నా పోలీసులు అనుమతి ఇవ్వడంలేదు. దాంతో ఆయన నియోజకవర్గానికి దూరం అయిపోయారు. ఇక అబ్బాయి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విషయం తీసుకుంటే ఆయన ధర్మవరం నుంచి గెలిచారు. ఆయన వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ళ కాలంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కార్యక్రమం చేపట్టి జనంతో మమేకం అయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ వారికి బాగా చేరువ అయ్యారు.
నిజానికి ఆయన అంతలా తిరిగిన దానికి రికార్డు మెజారిటీతో గెలవాలి. కానీ ధర్మవరానికి పొత్తులో భాగంగా వచ్చి పోటీ చేసిన బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ కి జనం పట్టం కట్టారు. దీంతో తీవ్రమైన వేదనకు వెంకట్రామిరెడ్డి గురి అయ్యారు. తాను ఎంతగానో ప్రజలకు సేవ చేస్తే తనను కాదని ఎన్నికల ముందు వచ్చిన వారిని జనాలు గెలిపిస్తారా అని మనో వేదనకు గురి అయి ఏకంగా నియోజకవర్గానికే దూరంగా ఉంటున్నారు.
ఆయన ఫేస్ బుక్ ల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారానే తన భావాలను అప్పడప్పుడు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంతే తప్ప ధర్మవరంలో మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల ముందు వచ్చి పది రోజులు తిరిగితే చాలు జనాలు గెలిపిస్తారులే అన్న వేదాంత భావంతో ఉన్నారని అంటున్నారు.
మొత్తానికి చూస్తే కేతిరెడ్లు ఇద్దరూ నియోజకవర్గాలకు దూరమై రాజకీయాల విషయంలో ఇబ్బందిపడుతూ ఉన్నారని అంటున్నారు. అయిదేళ్ళ పాటు దూకుడుగా సాగిన వీరి రాజకీయం ఇలా రివర్స్ కావడం అంటే కాల మహిమ అని అంటున్నారు. చూడాలి మరి కేతిరెడ్లకు మంచి రోజులు ఎపుడు వస్తాయో.