అనంత బలవంతుడైన వైసీపీ నేత జనసేనలోకి ?
అలా పవన్ ఇమేజ్ తో పాటు కేతిరెడ్డి లాంటి వారి వ్యక్తిగత పలుకుబడి తోడు అయితే రాయలసీమలో జనసేనని విస్తరించుకోవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 19 Dec 2024 2:30 AM GMTఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీద జనసేన పెద్దల కన్ను పడింది అని అంటున్నారు. ఆయన డైనమిక్ లీడర్ గా ఉంటారు. జనాలతో సదా మమేకం అవుతారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా గుడ్ మార్నింగ్ విత్ ఎమ్మెల్యే పేరుతో అయిదేళ్ల పాటు తన నియోజకవర్గంలో కార్యక్రమాన్ని రూపొందించి మన్ననలు అందుకున్నారు.
అటువంటి తాను ఎందుకు ఓటమి పాలు అయ్యానో తెలియదు అని ఆయన తీవ్ర ఆవేదన చెందడమే కాదు ఒక దశలో రాజకీయాల పట్ల వైముఖ్యం పెంచుకున్నారని వార్తలు వచ్చాయి. వైసీపీ అధినాయకత్వం వైఖరిని కూడా ఆయన కొన్ని సందర్భాలలో నిశితంగానే విమర్శించిన సంగతీ ఉంది.
ఆయన ఇపుడు మరోమారు సామాజిక మధ్యమాలలో నానుతున్నారు. వైసీపీకి వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు అయిన కేతిరెడ్డి కండువాను మారుస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఆయన మీద జనసేన దృష్టి సారించడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు.
బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతగా కేతిరెడ్డి ఉన్నారు. అనంతపురంలో జనసేనకు బలం ఉంది. పవన్ కళ్యాణ్ గతంలో అక్కడ నుంచి పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపించారు. అంతే కాదు పవన్ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అక్కడ అత్యధికంగా ఉన్నారు.
అలా పవన్ ఇమేజ్ తో పాటు కేతిరెడ్డి లాంటి వారి వ్యక్తిగత పలుకుబడి తోడు అయితే రాయలసీమలో జనసేనని విస్తరించుకోవచ్చు అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. అందుకే అనంతపురం నుంచే జనసేన విస్తరణకు దారులు తెరుస్తున్నారు అని అంటున్నారు.
ఇక జనసేన నేతలు కొందరు కేతిరెడ్డితో ఇప్పటికే ఈ విషయం మీద చర్చించారు అన్న వార్తలు వస్తున్నాయి. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు అని కూడా అంటున్నారు. అయితే కేతిరెడ్డి చాలా వీడియో బైట్లలో చెప్పి ఉన్న విషయం ఏంటి అంటే తాను రాజకీయాల్లో ఉన్నంతవరకూ వైసీపీకి విధేయుడిని అని జగన్ కి కూడా తాను వీర విధేయుడిని అని అంటున్నారు.
అందువల్ల ఆయన పార్టీని వీడే సమస్య లేదని తన వద్దకు వచ్చిన జనసేన నేతలకు చెప్పారని కూడా అంటున్నారు. అయితే కేతిరెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు మాత్రం జనసేన ఆసక్తిని చూపుతోందని అంటున్నారు. అవసరమైతే ఆయనకు కోరుకున్న విధంగా పదవులు ఇచ్చి అయినా తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. మరి కేతిరెడ్డి జనసేనలో చేరుతారా లేక వైసీపీకి వీర విధేయుడిగానే తన రాజకీయాన్ని కంటిన్యూ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.