వైసీపీకి అందుకే ఓటమి అంటున్న కేతిరెడ్డి
వైసీపీ ఘోరమైన ఓటమిని 2024 ఎన్నికల్లో దక్కించుకుని 151 సీట్లతో విజయ ఢంకా మోగించింది ఆ పార్టీయే.
By: Tupaki Desk | 2 Oct 2024 3:45 AM GMTవైసీపీ ఘోరమైన ఓటమిని 2024 ఎన్నికల్లో దక్కించుకుని 151 సీట్లతో విజయ ఢంకా మోగించింది ఆ పార్టీయే. 11 సీట్లతో పాతాళానికి పడిపోయింది ఆ పార్టీయే. ఈ విధంగా అద్భుతాలను చూసింది. అవమానాలను కూడా ఎదుర్కొంది.
దీంతో వైసీపీ ఘోరాతిఘోరమైన ఓటమికి గల కారణాలు ఏమిటి అన్న చర్చ అయితేనాలుగు నెలలు అయినా కూడా ఈ రోజుకీ జోరుగా సాగుతోంది. వైసీపీ ఓటమి వెనక ఎన్నో కారణాలు ఉన్నాయని ధర్మవరానికి చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అంటున్నారు.
తాజాగా ఆయన ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైసీపీ ఓటమి వెనక ప్రధానంగా ఒక బలమైన సామాజిక వర్గం నిర్లిప్తత కూడా ఉందని అన్నారు. టీడీపీకి నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం కమ్మలు సపోర్టు చేస్తారని అలాగే జనసేనకు కాపులు అత్యధికం ర్యాలీ అయ్యారని కానీ వైసీపీ విషయానికి వస్తే మాత్రం రెడ్లు ఈసారి అనుకున్నంతగా మద్దతు ఇవ్వలేదని ఒక కఠిన సత్యాన్ని ఆయన బయటపెట్టారు
వైసీపీకి గత ఎన్నికల్లో వెన్ను దన్నుగా ఉన్న రెడ్లు ఈసారి మాత్రం తమ వరకూ పార్టీ మీద అభిమానంతో ఓట్లు వేశారు తప్ప జనాల చేత ఓట్లు వేయించలేకపోయారు అని ఆయన విశ్లేషించారు.దానికి కారణం పార్టీ అధికారంలో ఉన్న అయిదేళ్లలో వారికి తగిన అవకాశాలు దక్కలేదని అన్నారు.
వైసీపీ అధినాయకత్వం ఎంచుకున్న సోషల్ ఇంజనీరింగ్ తో భారీగా దెబ్బ తిన్నది రెడ్లే అని ఆయన అన్నారు. కనీసం తమ గ్రామాలలో మండలాలలో మునిసిపాలిటీలలో కూడా స్థానిక పదవులు వారు అందుకోలేకపోయారు అని అన్నారు. ఒక నాయకుడు ఆ స్థాయికి రావడానికి కనీసం ఇరవై ఏళ్ల శ్రమ ఉంటుందని ఆయన అన్నారు.
అలాంటి నాయకుడికి దగ్గర దాకా వచ్చిన పదవిని సోషల్ ఇంజనీరింగ్ పేరుతో తప్పించి వేరే వారికి ఇస్తే వారి బాధ వర్ణనాతీతం అన్నారు. అంతే కాదు వారికి మళ్లీ అవకాశాలు రావాలీ అంటే కూడా మరెంత కాలం పడుతుందో కూడా అర్ధం కాని పరిస్థితి అని అన్నారు. ఇలా రెడ్లు మాత్రం తీవ్ర నిరాశకు లోను అయ్యారని దాని వల్ల కూడా వైసీపీ ప్రధానంగా ఓటమి పాలు అయింది అని అన్నారు.
అయితే వైసీపీ అధినాయకత్వం ఇపుడు అన్ని వైపుల నుంచి సమీక్ష చేసుకుంటోందని త్వరలోనే జగన్ కొత్త టీం తో ముందుకు వస్తారని ఆయన చెబుతున్నారు. పార్టీలో పనిచేసే వారిని గుర్తించి ముందుకు పెడితే కనుక కచ్చితంగా వైసీపీ మళ్లీ పుంజుకుంటుందని అన్నారు.
అదే విధంగా చూస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని అందువల్ల కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో మెల్లగా అసంతృప్తి రాజుకుంటోందని అన్నారు. వైసీపీ మొదటి నుంచి పోరాటాల మీదనే పునాదిగా మార్చుకుని ఏర్పడిన పార్టీ అని తమకు విపక్షం కొత్త కాదు అని ఆయన చెప్పారు. తాము జనంలో ఉంటూనే మళ్ళీ వారి అభిమానం పొందుతామని అన్నారు.
ఇక తన మీద వస్తున్న ప్రచారం తాను పార్టీ మారుతాను అంటూ వస్తున్న పుకార్లకు ఆయన చెక్ పెట్టేశారు. తాను రాజకీయంగా జగన్ తోనే ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయ పయనం జగన్ వెంటే అని కూడా క్లారిటీ ఇచ్చారు.