జగన్ బ్యాచ్ కు పవన్ ‘పవర్’ అర్థమవుతోంది
అప్పటివరకు ఆటలో అరటిపండు అనుకోవటం.. అంతలోనే ఆట మొత్తం మారిపోవటం లాంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటాం.
By: Tupaki Desk | 2 July 2024 5:21 AM GMTఅప్పటివరకు ఆటలో అరటిపండు అనుకోవటం.. అంతలోనే ఆట మొత్తం మారిపోవటం లాంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. అలాంటి సీన్ ను రాజకీయాల్లో చూపించిన క్రెడిట్ మాత్రం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కే దక్కుతుంది. ఇప్పుడైతే పవన్ పవర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అతడెంత శక్తివంతుడన్న దానిపై బోలెడన్ని విశ్లేషణలు వస్తున్నాయి. కానీ.. పదేళ్ల క్రితం ఇదే పవన్ గురించి వినిపించిన మాటలు.. జరిగిన చర్చ గురించి తెలిస్తే.. ఆయన్ను అర్థం చేసుకోవటానికి మించి అపార్థం చేసుకున్నదే ఎక్కువన్న విషయం అర్థమవుతుంది.
నిజానికి పవన్ సత్తాను గుర్తించింది చంద్రబాబు అనే చెప్పాలి. ఎందుకుంటే.. 2019లో ఓటమి తర్వాత పవన్ తో పొత్తు గురించి చంద్రబాబు ఆలోచించారు. అప్పటికి పవన్ అండ్ కో కూడా ఆ దిశగా ఆలోచనలు మొదలు పెట్టింది లేదు. ఎప్పుడైతే.. వైసీపీ నేతలు అదే పనిగా పవన్ ను టార్గెట్ చేయటం.. నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం నాలుగు పెళ్లాలు.. నాలుగు పెళ్లిళ్లు.. అంటూ అదే పనిగా విమర్శలు చేయటం పవన్ ఇరిటేట్ అయ్యేలా చేసింది.
తాను రాజకీయాల గురించి మాట్లాడుతుంటే.. తన ప్రత్యర్థులు మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టిన పవన్.. పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని వైసీపీ నేతలు.. అదే పనిగా పవన్ ను టార్గెట్ చేయటమే కాదు.. మరింత వెకిలి వ్యాఖ్యలు చేశారు. అప్పటివరకు పవన్ కు వైసీపీ రాజకీయ ప్రత్యర్థి మాత్రంగానే చూశారు. ఎప్పుడైతే వ్యక్తిగత హననానికి పాల్పడటటం చూశారో అప్పటివరకు అనుసరించిన వ్యూహాన్ని పక్కన పెట్టేసి.. జగన్ అండ్ కో లెక్కలు తేల్చేయాలని డిసైడ్ అయ్యారు. అదే పొత్తుకు దారి తీసింది.
వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా తమ చేతిలో ఉన్న అధికారంతో ఎవరినైనా సరే.. ఏమైనా అనేయొచ్చన్న బరితెగింపు వైసీపీని ఘోర ఓటమికి కారణమయ్యేలా చేసిందని చెప్పాలి. పిల్లిని సైతం గదిలో పడేసి నాలుగు దెబ్బలు కొడితే పులిగా మారుతుందన్న సామెత ఉండనే ఉంది. పవన్ కల్యాణ్ లాంటి ‘పవర్’ను అదే పనిగా టార్గెట్ చేస్తే.. అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఒంటి నిండా అధికారం పట్టేసి.. వాస్తవాలు కళ్లకు కనిపించని వేళ.. పవన్ పవర్ ను తప్పుగా అర్థం చేసుకున్నామన్న వాస్తవాన్ని వైసీపీ నేతలు గ్రహిస్తున్నారు.
ఇదే విషయాన్ని దాచి పెట్టకుండా ఓపెన్ అవుతున్న వారు లేకపోలేదు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్టు అయ్యారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పవన్ ను కెలకటం కూడా తమ ఘోర ఓటమికి కారణమన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. పవన్ పవర్ ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలకు అర్థమైందని.. మిగిలిన వారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది. పవనా.. మజాకానా.