ఓట్ల లెక్కింపులో అవకతవకలు... కేతిరెడ్డి సంచలన వీడియో!
అయితే ఇది ఏమాత్రం నమ్మసక్యంగా లేదనే కామెంట్లు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న పరిస్థితి.
By: Tupaki Desk | 14 Jun 2024 3:48 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగియడం, లెక్కింపు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడటం కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీ సాధించింది. అయితే... దాదాపు ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ ఘోర ఓటమి చవి చూసింది. అయితే ఇది ఏమాత్రం నమ్మసక్యంగా లేదనే కామెంట్లు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా కొన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
అవును... ఏపీలో వైసీపీ ఘోర ఓటమిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్ అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో వైఎస్ జగన్ కూడా.. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలు మాదిరి ఉన్నాయని, కాకపోతే సాక్ష్యం లేకుండా మాట్లాడలేమంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో ఈవీఎంలలో ఘోరాలు చోటుచేసుకున్నాయని లెక్కలు తీసుకున్నారు కేతిరెడ్డి.
ఈ క్రమంలో... ప్రశాంత్ కిశోర్, కేకే, అశ్వినీదత్ లాంటి వారు ఏ గ్రౌండ్ రిపోర్ట్ చేయకుండా కూటమికి 160 అని ఎలా చెబుతారని ప్రశ్నించిన ఆయన... ప్రజలనాడి ఎవరికీ అందలేదు అనేది వాస్తవమని అన్నారు. ఈ సందర్భంగా మీడియాలో వచ్చిన కొన్ని కథనాలను దృష్టిలో పెట్టుకుని, ఆధారంగా తీసుకుని కొన్ని విషయాలు వెల్లడిస్తానంటూ కేతిరెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు!
ఈవీఎంలలో ఎక్కువ పోలై.. కౌంటింగ్ లో తక్కువ నమోదై..!:
ఇందులో భాగంగా... తమిళనాడు రాష్ట్రంలో తిరువళ్లూరు లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 1430738 ఈవీఎం ఓట్లు పోలైతే... 1413947 మాత్రమే కౌంట్ చేశారని అన్నారు. అంటే... కౌంటింగ్ చేసినవాటికంటే 16,791 ఓట్లు తక్కువగా పోలైన ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో... అస్సాంలో 10760, ఒడిశాలో 9427, కేరళలో 7928 ఓట్ల తేడా ఉందని వివరించారు.
ఇదే సమయంలో... ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లోక్ సభ విషయానికొచ్చినా... 14,11,989 ఓట్లు ఈవీఎంలలో పోలైతే.. 14,04,061 ఓట్లు మాత్రమే కౌటింగ్ చేశారని అన్నారు. అంటే 7928 ఓట్లు కౌటింగ్ లెక్కల్లోకి రాలేదని తెలిపారు. అంటే... ఈవీఎం లలో ఎక్కువ ఓట్లు పోలైతే... కౌంటింగ్ సమయంలో మాత్రం వేల సంఖ్యలో ఓట్లు మాయమయ్యాయని తెలిపారు!
ఈవీఎంలలో తక్కువ పోలై.. కౌంటింగ్ లో ఎక్కువ నమోదై..!:
ఇందులో భాగంగా... ఈవీఎం లలో తక్కువ ఓట్లు పోలై, కౌంటింగ్ లో మాత్రం అంతకు మించి ఎక్కువగా నమోదైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పిన కేతిరెడ్డి వెకటరామిరెడ్డి... ఈ విషయంలో ఒక ఐదు రాష్ట్రాలను వెల్లడించారు. అస్సాంలోని కరీంగంజ్ నియోజకవర్గంలో 1136538 ఓట్లు పోలవ్వగా.. 1140346 ఓట్లు కౌటింగ్ అయ్యాయని.. అంటే సుమారు 3811 ఓట్లు అదనంగా కౌంటింగ్ అయ్యాయని తెలిపారు.
ఈ తరహాలో... ఒడిశాలోని బాలశోర్ నియోజకవర్గంలో 1467 ఓట్లు, మధ్యప్రదేశ్ లోని మండ్లా నియోజకవర్గంలో 1089 ఓట్లు, బీహార్ లోని బుక్సర్ లో 1010 ఓట్లు పోలైన వాటికంటే కౌంటింగ్ ఎక్కువగా అయ్యాయని తెలిపారు. ఇదే సమయంలో... ఏపీలోని ఒంగోలు లోక్ సభ విషయానికొస్తే... ఇక్కడ పోలైన ఓట్లు 1399707 కాగా, కౌంటింగ్ లో కనిపించినవి మాత్రం 1401174 గా ఉన్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో...!:
ఈ విధంగా దేశవ్యాప్తంగా సుమారు 140 నియోజకవర్గాల్లో ఈ విధంగా పోలైన ఓట్లకు, కౌంటింగ్ అయిన ఓట్లకూ మధ్య వ్యత్యాసం ఉందని తెలిపారు. అయితే లక్షల్లో మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో ఇలా వేలల్లో తేడా పరిగణలోకి వస్తుందా అనే సందేహాలకూ వివరణ ఇస్తూ కొన్ని ఉదాహరణలు చూపించే ప్రయత్నం చేశారు కేతిరెడ్డి.
ఇందులో భాగంగా... ముంబై నార్త్ వెస్ట్ లలో మొత్తం ఈవీఎం లలో పోలైన ఓట్లు 951580 ఓట్లు కాగా... ఈవీఎం లలో కౌంటింగ్ అయినవి 9501582 ఓట్లుగా ఉన్నాయని తెలిపారు. అయితే ఈ నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తికి కేవలం 48 ఓట్ల మెజారిటీ మాత్రమే రావడం గమనార్హం.
ఇదే క్రమంలో... జైపూర్ రూరల్ లోక్ సభ నియోజకవర్గంలో 1238818 ఓట్లు ఈవీఎంలలో పోలవ్వగా.. ఈవీఎం లలో లెక్కించినప్పుడు మాత్రం 12,37,966 ఓట్లుగా మాత్రమే చూపించిన పరిస్థితి. అంటే తేడా... 852 ఓట్లుగా ఉండగా... బీజేపీ అభ్యర్థి ఇక్కడ 1,618 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఇలా పలు నియోజకవర్గాల్లో పోలైన, కౌంటైన ఓట్లలో తేడాలను వివరిస్తూ... ఈ విషయాలపై ఎన్నికల కమిషన్ ఎక్కడా సరైన వివరణ ఇవ్వలేదని కేతిరెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఈ లెక్కలు చెబుతూ ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది!