నాడు సీఎంవో లో పరిస్థితిపై కుండబద్దలు కొట్టిన కేతిరెడ్డి!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 July 2024 4:30 AM GMTఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చాలా మంది ఊహించని రీతిలో ఆ పార్టీ దెబ్బతింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా ఓడిపోవడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో మరో కీలక కారణం చెప్పారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి.
అవును... ఏపీలో వైసీపీ ఘోర పరాజయం అనంతరం పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులూ స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒకరు లిక్కర్ పాలసీ వల్ల ఓడిపోయామంటే.. మరొకరు తమ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణం అని అన్నారు. ఇదే సమయంలో... మంచి చేసి ఓడిపోయాం.. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు అని మరొకరు తెలిపారు.
అయితే తాజాగా ఈ విషయాలపై స్పందించారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఇందులో భాగంగా.. సంక్షేమం సంగతి కాసేపు పక్కనపెడితే.. నియోజకవర్గంలో చిన్న చిన్న అభివృద్ది పనులకు సైతం నిధులు మంజూరు అయ్యేవి కావని.. నేరుగా జగన్ ని కలిసి చెప్పినప్పటికీ సీఎంవో లోని అధికారులు ఆ నిధులను విడుదల చేసేవారు కాదని.. జగన్ ప్రియారిటీలు వేరుగా, సీఎంవోలోని అధికారుల ప్రియారిటీలు వేరుగా ఉండేవని తెలిపారు.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా తన నియోజకవర్గంలో ఓ ఫ్లైఓవర్ నిర్మాణం నిమిత్తం రూ.10 - 15 కోట్లు అవసరమయ్యి సీఎం ని కలిస్తే.. ఆయన ధనుంజయ్ రెడ్డి వంటి అధికారులకు చెప్పారని అన్నారు. అయితే... ఆ అధికారులు మాత్రం ఆ నిధులను విడుదల చేయలేదని.. ఫలితంగా ఆ నిర్మాణం జరగలేదని.. సీఎంవోలోని అధికారుల తీరు అలా ఉండేదని కుండబద్దలు కొట్టారు!
దీంతో... వైసీపీ ఘోర పరాజయంలో నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని పలువురు అధికారుల పద్దతి, ప్రియారిటీలు కూడా ఒక కారణం అయ్యాయని తెలుస్తుందని అంటున్నారు. స్వయంగా సీఎం చెప్పినా సీఎంవో అధికారులు స్పందించలేదని నాటి అధికారపార్టీ ఎమ్మెల్యే చెబుతున్నారంటే వారి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.