Begin typing your search above and press return to search.

జగన్ కి పవన్ కి తేడా అదే...కేతిరెడ్డి సంచలన కామెంట్స్

అయితే ఒక వైసీపీ సీనియర్ నేతగా, ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడిగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జగన్ పవన్ ల మీద తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేశారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 4:30 PM GMT
జగన్ కి పవన్ కి తేడా అదే...కేతిరెడ్డి సంచలన కామెంట్స్
X

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ అలాగే జనసేన్ అధినేత పవన్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఎపుడూ కూడా కనీసం కలుసుకోలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. మీడియా ముఖంగానే ఈ ఇద్దరి మధ్యన రాజకీయ సమరం సాగుతూ వస్తోంది. ఇక చూస్తే జగన్ గొప్ప అని వైసీపీ నేతలు అనడం సహజం. అలాగే మా పవన్ ఈజ్ గ్రేట్ అని జనసేన నేతలు గర్వంగా చెప్పుకుంటారు.

అయితే ఒక వైసీపీ సీనియర్ నేతగా, ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడిగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జగన్ పవన్ ల మీద తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేశారు. ఆయన ఈ ఇద్దరి మధ్యన పోలికలు తేడాలు గురించి తమ కోణంలో మీడియా ముందు చెబుతూ సంచలన వ్యాఖ్యలే చేశారు.

నో డౌట్ ఏపీలో చూస్తే ఇద్దరే ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్ అని ఆయన చెప్పారు. ఆ ఇద్దరూ జగన్ అండ్ పవన్ కళ్యాణ్ అని అన్నారు. అయితే జగన్ కి వచ్చే జనమంతా ఆయన రాజకీయాల్లో చేసిన దానికి ఆయన నాయకత్వాన్ని చూసి వస్తారని, పవన్ కోసం వచ్చిన జనాలు ఆయన సినిమాలు చూసి అలా ఆయనను ఆదరించి వస్తారని తేడా చెప్పారు. అయితే పది నిమిషాల్లో పది వేల మంది జనాలకు పోగు చేసే సత్తా మాత్రం ఇద్దరికే ఉందని అన్నారు.

ఇక చూస్తే జగన్ కి ఒక రాజకీయ సిద్ధాంతం ఉందని అలాగే చంద్రబాబు పార్టీ ఫిలాసఫీ వేరు అని కానీ పవన్ పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అని కేతిరెడ్డి ప్రశ్నించారు. పవన్ 21 సీట్లు గెలిచి ఉండవచ్చు, అలాగే ముఖ్యమంత్రి రేసులో పోటీ పడవచ్చు కానీ సరైన రాజకీయ విధానం లేకపోవడం ఒక లోపంగా చెప్పారు.

ఇదిలా ఉంటే సినిమాల్లో మంచి చేసిన వారిని హీరోలుగా కీర్తిస్తారు కానీ అక్కడ వారు పోషించేది క్యారెక్టర్ మాత్రమే అని నిజ జీవితంలో ఎవరు సమాజానికి మంచి చేసారో జనాలు ఆలోచించుకోవాలని కేతిరెడ్డి సూచించారు. ఉత్తరాదిన జనాలకు ఆ తేడా తెలుసు అని వారు దక్షిణాదిన ఉన్నంతగా సినీ అభిమానాన్ని కలిగి ఉండరని అన్నారు. దక్షిణాదిన అయితే దేవుడి కంటే తమ సొంత అమ్మా నాన్నల కంటే కూడా ఎక్కువ ఆరాధిస్తారని ఆయన అంటూ ఇది ఎంతవరకూ మంచిదో జనాలే ఆలోచించుకోవాలని అన్నారు.

ఇంట్లో తినేందుకు తిండి ఉండదు కానీ తమ అభిమాన నటుడి కోసం ఉన్న డబ్బులు కూడా ఇచ్చేసే పిచ్చి ప్రేమతో జనాలు ఉన్నారని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలను కల్పించి విద్యా రంగంలో ఎన్నో మార్పులు తెచ్చిన జగన్ ని ఓడించారని మంచి మద్యం ఇస్తామంటే కూటమిని గెలిపించారని ఆయన అంటూ మనం ఎటు పోతున్నామో తెలియడం లేదని అన్నారు. ఏపీలో ఈ రోజున ఫీజులు కట్టలేక విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన విమర్శిస్తూ జగన్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా సాగిందని చెప్పారు

గతంలో మంచి పనులు చేసిన వారి మీద జనాలు విశ్వాసం ఉంచేవారని ఇపుడు మంచి చేసినా హామీలు అన్నీ తీర్చినా కూడా వైసీపీని ఓడించారు అంటే ఏమి చేయాలో ఏమి అనాలో ఎవరిని ఎలా చూడాలో కూడా అర్ధం కావడం లేదని అన్నారు ఇక సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్నది జనాలు గ్రహించకపోవడం బాధాకరం అన్నారు.

కమలహాసన్ కంటే గొప్ప నటులు ఎవరూ లేరని ఆయన ఓటమి పాలు అయ్యారని, అలాగే చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడించారని, ఇక హిందూపురం దాటి వెళ్ళి గుడివాడలో పోటీ చేస్తే బాలక్రిష్ణ కూడా మూడు సార్లు గెలిచేవారు కాదని కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు తమ జీవితాల గురించి ఆలోచన చేయాలి తప్పించి సినీ అభిమానంతో కాదని ఆయన అన్నారు. విజయసాయిరెడ్డి జగన్ పదవులు ఇవ్వకపోతే ఒక సాధారణ ఆడిటర్ గా మిగిలిపోయి ఉండేవారు అని ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.