స్వపక్షంలో విపక్షం.. కేతిరెడ్డి కథేంటి.. వైసీపీ డైలమా..?
ఆయన వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. మరి ఆయన కర్తవ్యం ఏంటి? పార్టీ తరఫున వాయిస్ వినిపించాలి కదా! కానీ.. ఆయన స్వపక్షంలో విపక్షం అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు.
By: Tupaki Desk | 4 Feb 2025 11:30 AM GMTఆయన వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. మరి ఆయన కర్తవ్యం ఏంటి? పార్టీ తరఫున వాయిస్ వినిపించాలి కదా! కానీ.. ఆయన స్వపక్షంలో విపక్షం అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు. అది కూడా పార్టీ అధినేత ఊళ్లో లేని సమయంలో నోరు చేసుకుంటున్నారు. దీంతో సదరునేత పరిస్థితి ఏంటో తేల్చాలని.. అనంతపురం వైసీపీ నాయకులు కోరుతున్నారు. ఆయనే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు `గుడ్ మార్నింగ్ ధర్మవరం` పేరుతో కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజల్లోకి వెళ్లారు.
ఈ కార్యక్రమాల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా అంతో ఇంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కేతిరెడ్డి ఓడిపోయారు. వైసీపీ వ్యతిరేక పవనాలు కావొచ్చు.. కూటమి అనుకూల హవా కావొచ్చు. అందరితోపాటు కేతిరెడ్డి కూడా పరాజయం పాలయ్యారు. కానీ, ఆయన తరచుగా వైసీపీ అధినేతను కార్నర్ చేస్తున్నారు. ఇదే సమయంలో కూటమి పార్టీల అధినేతలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అది కూడా పార్టీ అధినేత జగన్ లండన్‌లో ఉన్నప్పుడు.. లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రెచ్చిపోతున్నారన్న ది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ.
ఇటీవల కూడా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని వ్యాఖ్యానించారు. ఇక, వైసీపీ అలా చేసి ఉంటే బాగుండేది. ఇలా చేయకుండా ఉంటే కూడా బాగుండేదని చెప్పుకొచ్చారు. వలంటీర్ వ్యవస్థపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామాలు.. పార్టీకి మేలు చేయకపో గా.. మరింత డైల్యూట్ చేస్తున్నాయన్నది అనంతపురం నాయకుల ఆవేదన. ఈ నేపథ్యంలో కేతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. మాజీ మంత్రి శంకరనారాయణ వంటివారు వ్యాఖ్యానించారు.
కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ పరంగా ఎవరిపైనా చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఎలాంటి చర్యలు లేకుండానే చాలా మంది నాయకులు పార్టీ మారుతున్నారు. ఇప్పుడు చర్యలు తీసుకుంటే.. మరింతగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి వేచి చూడడమే సరైన చర్య అని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఎవరైనా సరే.. పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని.. ప్రస్తుతం పార్టీ ఇబ్బందుల్లో ఉందని వారు అంగీకరిస్తున్నారు. మరి కేతిరెడ్డి వ్యూహం ఏంటో.. ఆయన ఏం చేయాలని అనుకుంటున్నారో.. తేలాలంటే.. త్వరలోనే తేలనుందని మరో ప్రచారం జరుగుతోంది.