రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సంచలన కీలక నిర్ణయం!
ఈ నేపథ్యంలో తాజాగా భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకొంది.
By: Tupaki Desk | 3 Dec 2024 4:08 AM GMTపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు కేంద్రంగా విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకొంది. ఈ నేపథ్యంలో తాజాగా భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకొంది.
అవును... పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యదవ్ లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.
ఈ కీలక సమావేశంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, లా & ఆర్డర్, సివిల్ సప్లైస్, మారిటైమ్ బోర్డు, కస్టమ్స్, కాకినాడ పోర్టు, రవాణా శాఖ అధికారులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా... కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా పోర్టుకు సెక్యూరిటీ కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను నియమించాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో... రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం నిర్ణయించింది. కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయనున్నారు.
ఇదే సమయంలో... కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే క్రమంలో.. పోర్టులోని ఐదు వేర్ హౌసుల్లో సార్టెక్స్ మిషన్లూ ఉన్న అంశంపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం... సార్టెక్స్ యంత్రాల ఏర్పాటుపై విచారణ చేపట్టాలని ఆదేశించింది.
"సీజ్ ది షిప్" పై కసరత్తు!:
మరోవైపు రేషన్ బియ్యం రవాణా చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైకోర్టును ఆశ్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై న్యాయశాఖ అధికారులతో చర్చించారని తెలుస్తోంది.
అయితే... గతంలో అధికారులు సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని, కోర్టు ఆదేశాల మేరకు వ్యాపారులు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి తీసుకెళ్లగా.. అదే సరుకును ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు అదే బియ్యాన్ని మరోసారి సీజ్ చేయడం సాధ్యమేనా అనే అంశంపైనా న్యాయసలహా తీసుకుంటున్నారని అంటున్నారు.