ఔను.. నిబంధనలు అతిక్రమించారు.. వివేకా హత్య కేసులో కీలక అప్డేట్
దస్తగిరి ఫిర్యాదుపై విచారణ జరిపించిన ప్రభుత్వం విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ నివేదిక ప్రకారం సూపరింటెండెంట్ ప్రకాశ్ కు నోటీసులు జారీ చేశారు.
By: Tupaki Desk | 22 Feb 2025 7:10 AM GMTమాజీ మంత్రి వివేకా హత్యకేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని కడప జైల్లో బెదిరించారనే ఆరోపణలపై అప్పటి సూపరింటెండెంట్ పై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. దస్తగిరి ఫిర్యాదుపై విచారణ జరిపించిన ప్రభుత్వం విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ నివేదిక ప్రకారం సూపరింటెండెంట్ ప్రకాశ్ కు నోటీసులు జారీ చేశారు. జైలు నిబంధనలు అతిక్రమించి, రిమ్స్ వైద్యులు అందుబాటులో ఉండగా, ప్రైవేటు వైద్యులను జైలులోకి అనుమతించారని, పైగా వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి జైలులో ఉండగా, నిందితుడు కుమారుడైన చైతన్యరెడ్డిని అనుమతించడం ద్వారా జైలు నియమనిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ పలువురు నిందితులను అరెస్టు చేసింది. అయితే నిందితుడల్లో ఒకరైన షేక్ దస్తగిరి కోర్టు అనుమతితో అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత మరో కేసులో అరెస్టు అయిన దస్తగిరి 2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే దస్తగిరి రిమాండ్ లో ఉండగా, వివేకా కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి వైద్యశిబిరం పేరిట కడప సెంట్రల్ జైలుకు వచ్చి దస్తగిరిని బెదిరించినట్లు కొద్ది నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ జైలులో దాదాపు వారం రోజుల పాటు విచారణ జరిపారు. జైలు సిబ్బంది, ఖైదీలు, వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. స్థానికంగా ప్రభుత్వ వైద్యులు ఉన్నప్పటికీ జైలులోపలకు ప్రైవేటు వైద్యులను అనుమతించడం నిబంధనలు ఉల్లంఘించడమేనని ప్రభుత్వానికి నివేదిక అందినట్లు చెబుతున్నారు.
ఓ హత్యకేసులో అప్రూవర్ జైలులో ఉండగా, అదే కేసులో నిందితుడి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డిని జైలులోకి అనుమతించడం దుష్ప్రవర్తన కిందకి వస్తుందని విచారణాధికారి ఆరోపించారు. దురుద్దేశంతోనే చైతన్యరెడ్డిని జైలుకు తీసుకువచ్చారని జైలు పరిపాలన నిబంధనలు అతిక్రమించారని నివేదికలో పేర్కొన్నారు. ప్రకాశ్ ప్రస్తుతం నెల్లూరులోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రీఫార్మేషన్ సర్వీసెస్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. ఈ వ్యవహారంలో ప్రకాశ్ పై మూడు అభియోగాలు నమోదు చేశారు. వీటిపై పది రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా హాజరై సమాధానాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గడువులోగా సమాధానాలు రాకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఫిర్యాదుతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరిని కలిసేందుకు ఉద్దేశపూర్వకంగా అవకాశం కల్పించారని డాక్టర్ సునీత ఆరోపిస్తున్నారు. వైద్య సేవ ముసుగులో జైలుకు వచ్చిన చైతన్యరెడ్డి అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్లు ఆమె ఆరోపించారు. కాగా, సూపరింటెండెంట్ ప్రకాశ్ ఏపీ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి-1964లోని నిబంధనలు, ఏపీ కారాగార నియమావళిలోని నిబంధనలు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది.
అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే సూపరింటెండెంట్ ప్రకాశ్ విచారణాధికారికి తన వివరణ ఇచ్చారు. తాను లేని సమయంలో జైలులోకి డాక్టర్ చైతన్య రెడ్డి, డాక్టర్ రామాంజులరెడ్డి వచ్చారని, రోగులకు వైద్య పరీక్షలు చేశారని వివరించారు. తాను భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో వారు జైలులోకి ప్రవేశించారని ప్రకాశ్ చెబుతున్నారు. చైతన్యరెడ్డి జైలులోకి వచ్చారని తనకు తెలిసిన వెంటనే జైలుకు వచ్చానని, అయితే ఆ సమయంలో చైతన్యరెడ్డి ఖైదీలను పరీక్షిస్తున్నారని, ఆ సమయంలో ఆపేయమని ఆదేశించడం కరెక్టు కాదని అనుమతించినట్లు ప్రకాశ్ చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వం అభియోగాలు నమోదు చేయడంతో వివేకా కేసు మరో మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు.