ఈ ఏడాది ఎన్నికల ఎఫెక్ట్ : బడ్జెట్లో బిహారుకే పెద్దపీట
కేంద్ర ప్రభుత్వం బిహార్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది. ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు కేటాయించింది.
By: Tupaki Desk | 1 Feb 2025 8:15 AM GMTకేంద్ర ప్రభుత్వం బిహార్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించింది. ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు కేటాయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పదే పదే బిహార్ రాష్ట్రం పేరు ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతం మిథిలాంచల్ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించారు.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరడానికి దోహదపడిన బిహార్ కు కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పెద్దపీట వేశారు. ప్రతి పద్దులోనూ ఆ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం కేటాయించారు. ముఖ్యంగా వెనకబడిన ప్రాంతం మిథిలాంచల్ అభివృద్ధికి దోహదపడేలా 50 వేల హెక్టార్లలో వెస్టర్న్ కోసి కెనాల్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా దేశంలో ఎన్నో ఐఐటీలు ఉండగా, పట్నా ఐఐటీని విస్తరిస్తామని ప్రత్యేకంగా వెల్లడించడం గమనార్హం.
పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేలా లక్ష్యం పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలోనూ బిహార్ కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. ఆ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా బిహార్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యూరుషిప్ అండ్ మేనేజ్మెంట్ డర్డు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు ఇస్తామన్నారు.
ముఖ్యంగా బిహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పనిచేయనుంది. బిహార్ లో ఏర్పాటు చేయనున్న మఖానా బోర్డు ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని చెప్పారు. రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు వారు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ఇలా బిహార్ లో రైతులు, మధ్యతరగతి జనానికి మేలు జరిగేలా అనేక వరాలు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి. అయితే దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా, ఎన్నికలను దృష్టి పెట్టుకుని కేవలం ఒక్క రాష్ట్రానికే ఎక్కువ మేలు జరిగేలా బడ్జెట్ లో కేటాయింపులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సీట్లు దక్కించుకుంది. మొత్తం 40 స్థానాలకు 30 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. బీజేపీకి 12 సీట్లు, జేడీయూకి 12 సీట్లు, ఎల్జేపీకి 5 సీట్లు దక్కాయి. ఈ ఊపుతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో బడ్జెట్ లో అధిక కేటాయింపులు చేశారంటున్నారు.