దిశా సాలియన్ ఆత్మహత్య కేసు.. క్లోజర్ రిపోర్టులో షాకింగ్ విషయాలు!
దిశా సాలియన్ కేసు క్లోజర్ రిపోర్టులో తాజాగా సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 28 March 2025 11:27 AMదివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మరోసారి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇటీవల దిశాతండ్రి సతీష్ సాలియన్ తన కూతురు మృతి విషయంలో ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పేరు తెరపైకి తెచ్చారు.
ఇందులో భాగంగా... 2020 జూన్ 8న తన కుమార్తె ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసిందని.. ఆ పార్టీకి ఆదిత్య ఠాక్రేతో పాటు అతని బాడీగార్డులు, నటులు డినో మోరియా, సూరజ్ పంచోలి, మరికొంతమంది హాజరయ్యారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని సతీష్ ఆరోపించారు.
ఈ పిటిషన్ లో ఆదిత్య ఠాక్రేపై లైంగిక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముంబై పోలీసులు ఆదిత్య ఠాక్రే, రియా చక్రవర్తితో సహా 9 మందిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. దీంతో... ఈ వ్యవహారం మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సంగతి అలా ఉంటే... ఈ కేసులో తాజాగా ఆమె తండ్రి పేరుతో మరో కోణం వెలుగు చూసింది!
అవును... దిశా సాలియన్ కేసు క్లోజర్ రిపోర్టులో తాజాగా సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఆమె తండ్రి సతీష్ సాలియన్ ఆర్థిక ద్రోహం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా.. సతీష్ పై పలు ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
అప్పట్లో దిశా సాలియన్ కు పలు ప్రాజెక్టులు వరుసగా ఫెయిల్యూర్ కావడంతో ఆమెకు తీవ్ర ఒత్తిడి నెలకొందని చెబుతున్నారు. మరోపక్క ఆమె కష్టపడి సంపాదించిన డబ్బును థానేలోని తన సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ లో తనతో సంబంధం ఉన్న మహిళా ఉద్యోగి కోసం ఆమె తండ్రి ఖర్చు చేయడం ద్వారా దుర్వినియోగం చేసినట్లు చెబుతున్నారు.
ఆ సమయంలో... కుటుంబ సమస్యల కారణంగా దిశా సాలియన్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారని చెబుతున్నారు. మరోపక్క దిశ స్నేహితులతో పాటు ఆమెకు కాబోయే భర్త కూడా తన పోలీస్ వాంగ్మూలంలో.. ఆమె డబ్బును ఆమె తండ్రి మరో మహిళకు ఖర్చు చేసినట్లు చెప్పారని కథనాలొస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.