Begin typing your search above and press return to search.

1.31 కోట్ల టన్నులు - రూ.45 వేల కోట్లు... కాకినాడ పోర్టుపై కీలక విషయాలు!

పేదలకు అందాల్సిన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Dec 2024 11:17 AM GMT
1.31 కోట్ల టన్నులు - రూ.45 వేల  కోట్లు... కాకినాడ పోర్టుపై కీలక విషయాలు!
X

పేదలకు అందాల్సిన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కాకినాడ జిల్లా కలెక్టర్ చొరవ చూపించగా.. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం మరింత సీరియస్ గా స్పందించారు. ఈ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన విషయాలు వెల్లడించారు.

అవును... కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కాదని.. ఇక్కడ ఉన్న భద్రత గురించి ఆలోచిస్తే, ఇది దేశ భద్రతకే ప్రమాదంగా మారిందని.. నేడు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నప్పుడు, రేపు ఇంక ఏదైనా ఎగుమతి, దిగుమతి అవ్వదన్న గ్యారెంటీ ఏమిటంటూ పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో తాజాగా మీడియాతో మాట్లాడిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... వైసీపీ హయాంలో కాకినాడ పోర్టులో కేవలం 20 మంది పోలీసులు మాత్రమే పని చేశారని తెలిపారు. తాజాగా తనిఖీ చేసిన నిల్వల్లో ఇరవై ఐదు టన్నుల రేషన్ బియ్యం లభించాయని ఆయన తెలిపారు.

గత మూడేళ్లలోనే రూ.45 వేల కోట్ల విలువైన కోటీ 31 లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని సంచలన విషయాలు వెల్లడించారు. ఈ స్థాయిలో భారీ దోపిడీ జరిగింది కాబట్టే పోర్టుపై తాము ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఇదే సమయంలో రేషన్ బియ్యం కోసం రూ.12,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు!

ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం అక్రమ నిల్వలపై దాడులు చేశామని.. కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గిడ్డంగుల్లో తనిఖీలు చేశామని.. వేల టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించామని తెలిపారు. దీంతో.. ఆయా గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు.

ఈ సందర్భంగా... ఇంత పెద్ద పోర్టులో కేవలం 20 మంది సెక్యూరిటీనే ఉంచుతారా..? అని ప్రశ్నించిన మనోహర్... వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకుని బియ్యం ఎగుమతి చేశారని చెబుతూ.. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్, కన్నబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు వెనుక ఎవరున్నారో ప్రజలకు అర్ధం కావాలని.. ఈ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.