రెచ్చిపోయిన ఇజ్రాయిల్.. హమాస్ మరో కీలక నేత హతం
ఇదిలా ఉంటే.. లెబనాన్‌లో ఇజ్రాయిల్ ఇప్పటివరకు చేసిన దాడుల్లో సుమారు 2వేల మందికి పైగానే చనిపోయారు.
By: Tupaki Desk | 5 Oct 2024 8:02 AM GMTపశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఇరాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయిల్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల బీరూట్‌లో ఇజ్రాయిల్ దాడులు నిర్వహించి.. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతమొందించింది. ఆయనతో పాటు ఆయన కూతురు సైతం ఆ దాడిలో చనిపోయారు. దాంతో ఇరాన్ దేశం ఇజ్రాయిల్‌పై ప్రతీకారంగా 180 క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో మరోసారి ఇజ్రాయిల్ దాడులకు సిద్ధమైంది. ఇరాన్ తమపై దాడులకు దిగి పెద్ద తప్పు చేసిందని, తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఆ సందర్భంలో హెచ్చరించారు.
అందులో భాగంగానే మరోసారి హెజ్బుల్లాపై దాడులు చేసింది. ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన మరో కీలక నేతతోపాటు ఆయన కుటుంబ సభ్యులు చనిపోయానిట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయిల్ తాజాగా.. ఉత్తమ లెబనాన్‌లోని ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై దాడులు నిర్వహించింది. వైమానిక దాడులకు పాల్పడింది. ఇందులో హమాస్ కీలక నేత అల్ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలోని సభ్యుడైన సయీద్ అతల్లా చనిపోయాడు. ఆయనతో పాటే ముగ్గురు కుటుంబసభ్యులు కూడా మృతిచెందారని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.
అటు.. ఇజ్రాయిల్‌కు చెందిన పలు వార్తా సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఇదిలా ఉంటే.. లెబనాన్‌లో ఇజ్రాయిల్ ఇప్పటివరకు చేసిన దాడుల్లో సుమారు 2వేల మందికి పైగానే చనిపోయారు. అయితే.. వారిలో 250 మంది హెజ్బుల్లాకు చెందిన వారే ఉండడం గమనార్హం.
మూడు నెలల క్రితం గాజాపై జరిపిన దాడుల్లో హమాస్ అప్రకటిత ప్రధానిగా ఉన్న రావీ ముష్తాహా చనిపోయినట్లు ఇజ్రాయిల్ భద్రతా దళాలు ప్రకటించాయి. ఆయనతోపాటు పొలిటికల్ బ్యూరో సీనియర్ నాయకుడు సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమి ఒదేహ్ చనిపోయినట్లు వెల్లడించాయి. కానీ.. వీరు చనిపోయిన అంశాన్ని హమాస్ మాత్రం ఎక్కడా ధ్రువీకరించలేదు. చనిపోయారని మాత్రం ఇజ్రాయిల్ ఖచ్చితంగా చెబుతోంది.