Begin typing your search above and press return to search.

కేటీఆర్ 10 గంటల విచారణలో కీలక పాయింట్ ఏమిటి?

ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు ఏసీబీ విచారణకు హాజరు కావటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jan 2025 6:20 AM GMT
కేటీఆర్ 10 గంటల విచారణలో కీలక పాయింట్ ఏమిటి?
X

ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు ఏసీబీ విచారణకు హాజరు కావటం తెలిసిందే. దాదాపు పది గంటలకు పైనే విచారణను ఎదుర్కొన్న ఆయనకు అధికారులు దాదాపు 80 ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. విచారణ మొత్తం నిధుల చెల్లింపు చుట్టూనే తిరిగినట్లుగా సమాచారం. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్ కాసింత ఫస్ట్రేట్ అయినట్లుగా కనిపించింది. ఒకే ప్రశ్నను పదే పదే తిప్పి..తిప్పి అడిగారంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అయితే.. కేటీఆర్ మర్చిపోతున్న అంశం ఏమంటే.. విచారణ వేళలో అధికారులు ఏ అంశమైతే ముఖ్యమైందో.. దానికి సంబంధించి అన్ని కోణాల నుంచి ప్రశ్నలు సంధించటం మామూలే అని. కేటీఆర్ విచారణకు ముందు నాటి ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ విచారణకు హాజరు కావటం.. ఆయన ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నల్నికేటీఆర్ కు సంధించినట్లుగా చెబుతున్నారు.

మొత్తం పది గంటల విచారణలో మధ్యాహ్నం లంచ్ వేళలో గంట పాటు విరామం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విచారణ తర్వాత.. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపినట్లుగా తెలుస్తోంది. నిధుల విడుదలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కీలక సమాధానాలను చెప్పినట్లుగా సమాచారం. మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారమే నడుచుకున్నానని.. సమయాభావం వల్లే అనుమతుల గురించి ఆలోచించలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో ఏ1గా ఉన్న ఆయన.. మంత్రిమండలి అనుమతి లేకుండా పన్నులతో సహా రూ.55 కోట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లించిన అంశం.. విదేశీ సంస్థకు నిధులు చెల్లించేటప్పుడు ఆర్ బీఐ అనుమతి తీసుకోలేదన్న ప్రధాన అభియోగాలు నేపథ్యంలో విచారణ సాగినట్లుగా చెబుతున్నారు.

అనుమతులు లేకుండా ఎఫ్ఈవోకు నిధులు చెల్లించిన అంశం చుట్టూనే విచారణ ఎక్కువ భాగం సాగినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయంగా రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న ఉద్దేశంతోనే రేసు నిర్వహణ తలపెట్టినట్లుగా పేర్కొన్న కేటీఆర్.. తొలి రేసుకు స్పాన్సరర్ గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ రెండో రేసు నిర్వహణ నుంచి వైదొలిగందని.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బాధ్యత తీసుకుందన్నారు.

కొత్త స్పాన్సర్ ను వెతికేందుకు సమయం లేని కారణంగా హెచ్ఎండీఏ నుంచి నిధులు మంజూరు చేశామని.. తన ఆదేశాలతోనే ఇదంతా జరిగినట్లుగా కేటీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని కేటీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. మంత్రివర్గం ఆమోదం తీసుకోవాలన్న నిబంధనను ఎందుకు పాటించలేదన్న ప్రశ్నకు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయటం మామూలేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. రేసు నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి ఏయే మార్గాల్లో ఎంత ఆదాయం వచ్చిందన్న ప్రశ్నకు ఆ వివరాలన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒప్పందానికి విరుద్ధంగా వైదొలిగిన ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు.. చర్యలు ఉపక్రమించే వేళకు ఎన్నికలు వచ్చాయని.. ఆ తర్వాత ప్రభుత్వం మారినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా తన అభిప్రాయాల్ని క్లియర్ గానే కేటీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. తదుపరి మరోసారి విచారణ ఉంటుందన్న భావన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.