Begin typing your search above and press return to search.

ఆయన అంటే జగన్ కి అంత నమ్మకమా?

అటువంటి సజ్జలకు మరోసారి అధినాయకుడు జగన్ కీలకమైన స్థానాన్ని పార్టీలో ఇచ్చారు.

By:  Tupaki Desk   |   16 Nov 2024 10:09 AM GMT
ఆయన అంటే జగన్ కి అంత నమ్మకమా?
X

వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ నమ్మకం చూరగొన్నారు అంటే వారు గ్రేట్ అనే అనాలి. జగన్ అన్ని కోణాల నుంచి పరిశీలించిన మీదటనే వారి మీద పూర్తి నమ్మికను చూపిస్తారు. అలా జగన్ నమ్మకాన్ని వైసీపీలో కొండంత పొందిన వారుగా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని అంతా చూస్తున్నారు

వైసీపీ అయిదేళ్ల పాలనలో సజ్జల అంతా తానై కనిపించారు అని అంటారు. ఆయనను ప్రత్యర్థి పార్టీలు నాడు సకల శాఖల మంత్రి అని కూడా వ్యంగ్యంగా పిలుస్తూ ఉండేవి. సజ్జల పార్టీలోనూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముఖ్య పాత్రను పోషించారు. ఒక విధంగా వైసీపీ ప్రభుత్వంలో అత్యంత శక్తిమంతుడిగా సజ్జల కనిపించారు

అటువంటి సజ్జలకు మరోసారి అధినాయకుడు జగన్ కీలకమైన స్థానాన్ని పార్టీలో ఇచ్చారు. వైసీపీ రాష్ట్ర స్థాయి కో అర్డినేటర్ పదవిని సజ్జలకు ఇచ్చారు. దీంతో ఈ అంశం ఇపుడు వైరల్ అవుతోంది. సజ్జ్లకు ఇంతటి ప్రధాన హోదాని పార్టీలో ఇవ్వడం పట్ల కూడా వైసీపీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

ఎందుకంటే సజ్జల వల్లనే పార్టీ ఓటమి పాలు అయిందని ఎన్నికల తరువాత జరిగిన విశ్లేషణలు చర్చలలో వచ్చినట్లుగా చెబుతారు. ఆయన జగన్ కి క్యాడర్ కి లీడర్ కి మధ్య గ్యాప్ ఉండేలా చేసారని కూడా విమర్శలు వచ్చాయి. అయితే సజ్జల పనితీరు జగన్ కి నచ్చడంతో పాటు ఆయన అత్యంత విశ్వాసపాత్రుడిగా నమ్మి మాత్రమే పట్టం కట్టారని మరో వాదన కూడా ఉంది.

పార్టీ కష్టకాలంలో ఉన్న వేళ ఆయన వెన్నంటి ఉన్నారని అందుకే ఆయనకు ఈ కీలక హోదా దక్కిందని అంటున్నారు. వైసీపీ ఉమ్మడి జిల్లాలలను రీజియన్లుగా విడదీసి రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. అలా మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, అయోద్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డిలకు అవకాశం ఇచ్చారు

ఇపుడు మొత్తం స్టేట్ కో ఆర్డినేటర్ గా సజ్జలకు పెద్ద పదవినే ఇచ్చారు అని అంటున్నారు. అంటే రీజనల్ కో ఆర్డినేటర్లతో జిల్లా ఇంచార్జిలతో నియోజకవర్గం ఇంచార్జిలతో కూడా సజ్జల కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందన్న మాట.

ఒక విధంగా చెప్పాలీ జగన్ తరువాత అంతటి స్థాయి కలిగిన పదవిని సజ్జలకు ఇచ్చారని అంటున్నారు. వైసీపీలో చూస్తే స్టేట్ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి గతంలో లేదు. కానీ ఇపుడు దానిని క్రియేట్ చేసి మరీ సజ్జలకు ఇచ్చారని అంటున్నారు. అందువల్ల సజ్జల మొత్తం పార్టీనే నడిపించే స్థాయిలో ఉన్నారని అంటున్నారు.

పార్టీలో సజ్జల మీద భిన్న అభిప్రాయాలు ఉన్నా ఆయన విషయంలో జగన్ నమ్మకంతోనే ఇంతటి బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని మరీ ఈ పదవిని ఆయనకు ఇచ్చారని అంటున్నారు. జమిలి ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో సజ్జలకు ఈ పదవికి ఇవ్వడం ద్వారా జగన్ పార్టీని యాక్టివ్ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక చాలా కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇంచార్జిలను నియమించారు. రానున్న రోజులలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు ఇంచార్జిలను నియమించడం ద్వారా పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగాలని జగన్ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా జగన్ సజ్జలకు మళ్లీ అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం పట్ల చర్చ అయితే సాగుతోంది.