వాలంటీర్లకు షాక్ ఇచ్చేసినట్లేనా...?
దానికి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి బదులిస్తూ వాలంటీర్ వ్యవస్థ అన్నదే లేదని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం అని ఆయన అసలు విషయం చెప్పారు.
By: Tupaki Desk | 20 Nov 2024 10:24 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనం అయిదు వేల నుంచి పది వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే ఇపుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా వాలంటీర్ల విషయంలో హామీ అమలు కాలేదు. దాంతో ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వాలంటీర్లు అయితే ఇప్పటికే నిరసనలు ఆందోళనలు చేస్తూ పోతున్నారు.
కానీ ప్రభుత్వం పెద్దగా వాటిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఆలోచన ఏమి ఉంది అన్నది వైసీపీ నేతలు శాసనమండలి వేదికగా ద్వారా చాలా వరకూ బయట పెట్టే ప్రయత్నం చేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దానికి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి బదులిస్తూ వాలంటీర్ వ్యవస్థ అన్నదే లేదని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం అని ఆయన అసలు విషయం చెప్పారు. గత ఏడాది ఆగస్టు తరువాత వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
దాంతో ప్రభుత్వం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడ లేకుండా పోయిందని మంత్రి చెప్పడం విశేషం. వాలంటీర్లను కొనసాగించేందుకు ప్రభుత్వం ఆలోచించిన మాట నిజమే కానీ అసలు వ్యవస్థ లేని చోట ఏమి చేయాలని మంత్రి అనడం విశేషం.
అంతే కాదు లేని ఉద్యోగులకు ఎలా వేతనాలు చెల్లించాలని మంత్రి డోలా ఎదురు ప్రశ్నించడంతో వైసీపీ కి అది షాక్ గా మారింది. అంతే కాదు జగన్ కి తాను అధికారం కోల్పోతున్నాను అన్నది ముందే తెలిసిందా అందుకేనా వాలంటీర్ల వ్యవస్థను క్రమబద్ధీకరణ చేయలేదని మంత్రి సెటైర్లు పేల్చారు.
ఎన్నికల హడావుడిలో తాము వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ గా చేసి ఉండకపోవచ్చని ఇపుడు జీవోతో ఎందుకు వారిని కొనసాగించరాదు అని బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే మే వరకూ తామే వేతనాలు చెల్లించామని వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం కొనసాగించి ఉంటే తాము వారిని కంటిన్యూ చేసేవారమని మంత్రి బదులిచ్చారు.
అంటే తప్పు వైసీపీ ప్రభుత్వం చేసిందని మంత్రి సూటిగానే చెప్పేశారు. మాకు వాలంటీర్ వ్యవస్థ మీద విశ్వాసం ఉంది అంటేనే ఆ వ్యవస్థ అయితే ఏపీలో ప్రస్తుతం లేదని తేల్చేశారు. దీనిని బట్టి వాలంటీర్లకు భారీ షాక్ ఇచ్చేసినట్లే అని అంటున్నారు.
ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల మంది దాకా వాలంటీర్లను తీసుకుంది. అయితే వారి సేవలను వైసీపీ ప్రభుత్వం జీవో 5 ద్వారా తీసుకొచ్చిందని చెబుతున్నారు. అలా ఏటేటా వారిని రెగ్యులర్ చేయాల్సి ఉందని కానీ 2023 సెప్టెంబర్ తరువాత దీనిపై ఎటువంటి ఉత్తర్వులు వెలువరించలేదని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి చూస్తే వాలంటీర్ల సేవలను కొనసాగించడం లేదని అంటోంది. ఒక విధంగా వారిలో రాజీనామాలు చేసిన వారిని పక్కన పెట్టినా ఇంకా లక్షన్నర మంది దాకా ఉన్నారు.
వారందరినీ పది వేల నెలవారి గౌరవ వేతనంతో కొనసాగించడం తడిసి మోపెడు అవుతుంది. ప్రస్తుతం ఖజానాలో కూడా అంత సొమ్ము లేదని అంటున్నారు. పైగా వాలంటీర్ల సేవలను తీసుకోకపోతే పని జరగదు అన్న వాతావరణం కూడా లేదు. దాంతో కూటమి ప్రభుత్వం వారి విషయం అలా పక్కన పెట్టినట్లు అయింది అని అంటున్నారు. అదే టైం లో వారిని రెగ్యులరైజ్ చేయలేదని వైసీపీ మీద భారీ బండను వేసింది. దాంతో వాలంటీర్లు ఇపుడు వైసీపీ మీద మండుతారా లేక కూటమి మీద ఆగ్రహిస్తారా అన్నది చూడాల్సి ఉంది.