బందరు బియ్యం కేసు పోలీసులకు పక్కా ఆధారాలు?
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి వ్యతిరేకంగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 9 Jan 2025 12:30 PM GMTమచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఏప్రిల్, మే నెలల్లో అధికారుల ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం మినీ వ్యానులను వాడినట్లు చెబుతున్నారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతోపాటు ఇతర నిందితులు అంతా కలిసి 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి వ్యతిరేకంగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. గోడౌన్ మేనేజర్ మానస తేజ అకౌంట్ నుంచి పేర్ని నాని అకౌంటుకు రూ.1.75 లక్షలు బదిలీ చేయడంపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రూ.12 వేల జీతానికి పనిచేస్తున్న మేనేజర్ తన యజమాని భర్తకు అంతమొత్తం ఎందుకు పంపించాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా మానసతేజ అకౌంట్లో సుమారు రూ.25 లక్షల మేర లావాదేవీలు జరగడం, ఆయన వ్యక్తిగత అవసరాల కోసం రూ.7 లక్షలు ఖర్చు చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. తక్కువ జీతానికి పనిచేస్తున్న మేనేజర్ అంత మొత్తం ఎలా ఖర్చు చేశాడు? ఆయనకు ఆ డబ్బు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
కీలక ఆధారాలు లభించడంతో నిందితులను కోర్టు అనుమతితో ఒక రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు బ్యాంకులో నగదు లావాదేవీల విషయమై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మేనేజర్ మానసతేజతోపాటు డ్రైవర్ మంగారావు, మిల్లర్ ఆంజనేయులను పోలీసులు విచారించగా, మేనేజర్ పోలీసులకు సహకరించలేదని చెబుతున్నారు. దీంతో నిందితులను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే నిందితులు ముగ్గురూ మాజీ మంత్రి పేర్నిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. రేషన్ బియ్యం తరలించడంలో మాజీ మంత్రికి సంబంధం లేదని, తామే అమ్మేశామని పోలీసులకు చెబుతున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ స్టేట్ మెంట్ ను నమ్మడం లేదంటున్నారు. భారీ మొత్తంలో బియ్యం తరలించడం నిందితులకు సాధ్యం కాదని, దీనివెనుక పెద్ద హస్తం ఉందనే కోణంలోనే ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతున్నారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి పేర్ని సతీమణి జయసుధ సైతం తనకేమీ తెలియదని అంతా మేనేజర్ మానసతేజ మాత్రమే చేశాడని చెప్పారని అంటున్నారు. దీంతో ఆమెను కూడా మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందని పోలీసు వర్గాల సమాచారం. మొత్తానికి పేర్ని చుట్టూ ఉచ్చు బిగించేలా పోలీసుల విచారణ జరుగుతుందని అంటున్నారు.