Begin typing your search above and press return to search.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు మరో అరెస్టు

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై దాడి చేసిన ముగ్గురు ముసుగు వ్యక్తుల్లో ఒకరు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన కామేపల్లి తులసిబాబుగా పోలీసులు గుర్తించారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 9:31 AM GMT
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు మరో అరెస్టు
X

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముసుగులు ధరించి రఘురామ గుండెలపై కూర్చొని దాడి చేసిన ప్రైవేటు వ్యక్తిని అరెస్టు చేశారు. గురువారం నిందితుడిని ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై దాడి చేసిన ముగ్గురు ముసుగు వ్యక్తుల్లో ఒకరు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన కామేపల్లి తులసిబాబుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గుడివాడ టీడీపీలో కీలకంగా పనిచేస్తున్న తులసిబాబు గతంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమారుతో సన్నిహితంగా ఉండేవారని పోలీసులు చెబుతున్నారు. ఆ పరిచయంతో రఘురామపై దాడికి తులసిబాబు వచ్చినట్లు సమాచారం. దీనిపై పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు విచారణకు పిలిచి ఆ తర్వాత అరెస్టు చేశారు.

టీడీపీలో కీలక నేతగా ఉన్న రఘురామపై అదే పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి దాడి చేశారనే సమాచారం ఆసక్తికరంగా మారింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వాడివేడి చర్చ జరుగుతోంది. రఘురామపై దాడి చేశారని చెబుతున్న తులసిబాబుకు టీడీపీతో సంబంధం ఎలా ఏర్పడింది. దాడి చేసినప్పుడే ఆయన టీడీపీలో ఉన్నారా? లేక ఈ మధ్యే పార్టీలోకి వచ్చారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబుకు గుడివాడ టీడీపీతో పనేంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తులసిబాబు విచారణకు వచ్చిన సమయంలో భారీ కాన్వాయ్ ని వెంటబెట్టుకుని రావడం, వెంట వచ్చిన వారు తులసిబాబుకు మద్దతుగా నినాదాలు చేయడం హీట్ పుట్టించింది.

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం జే.పొంగులూరు మండలం రామకూరు తులసిబాబు స్వగ్రామంగా చెబుతున్నారు. ఆ గ్రామంలో మెజార్టీ ప్రజలు టీడీపీ సానుభూతిపరులైనప్పటికీ, తులసిబాబు కుటుంబం మాత్రం తొలి నుంచి వైసీపీకి సానుభూతిపరులుగా ఉన్నారని తెలుస్తోంది. నరసారావుపేటలో ఇంజనీరింగ్ చదువుకున్న తులసిబాబు పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేసేవాడని, ఆ క్రమంలో వైసీపీకి మరింత సన్నిహితంగా మారాడని పోలీసులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో మంత్రి లోకేశ్ కి వ్యతిరేకంగా పనిచేసిన తులసిబాబు ఆ తర్వాత సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కి దగ్గరయ్యారని అంటున్నారు. అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కుటుంబానికి సునీల్ కుమార్ తో బంధుత్వం ఉండటంతో తులసిబాబు 2022 నుంచి గుడివాడలో రాము కోసం పనిచేయడం మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.

టీడీపీకి ప్రతిష్ఠాత్మకమైన గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించేందుకు బలమైన ప్రణాళికలు వేసిన తులసిబాబు అక్కడి పార్టీ క్యాడరుతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. సొంత నియోజకవర్గంలో వైసీపీ, గుడివాడలో టీడీపీకి పనిచేస్తున్న తులసిబాబు.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమారుతో ఉన్న పరిచయం వల్లే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా మారాడని చెబుతున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు, సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ మాత్రం పోలీసుల ఆరోపణలతో విభేదిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి రఘురామ కేసులో నిందితుడికి టీడీపీతో సంబంధాలు ఉండటం చర్చకు తావిస్తోంది.