సైఫ్ దాడి కేసు: పోలీసుల కస్టడీలో నిందితుడు ఏం చెప్పాడు?
అయితే తాజాగా పోలీసుల విచారణలో అతడు ఒక రెస్టారెంట్‌లో వెయిటర్ ని అని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు సైఫ్ పై దాడి చేశానని నేరం చేసినట్లు అంగీకరించినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు.
By: Tupaki Desk | 19 Jan 2025 9:06 AM GMTసైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు ఘటనలో తాజా పరిణామం ఏమిటో తెలుసుకోవాలని ప్రజలు సర్వత్రా ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ముంబై పోలీసులు ఈ ఉదయం థానే నుండి ఈ కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన నిందితుడు ఇంతకుముందు సైఫ్ ఖాన్ ఇంట్లో హౌస్ కీపింగ్ పని కోసం వెళ్లాడని కథనాలొచ్చాయి. అయితే తాజాగా పోలీసుల విచారణలో అతడు ఒక రెస్టారెంట్‌లో వెయిటర్ ని అని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు సైఫ్ పై దాడి చేశానని నేరం చేసినట్లు అంగీకరించినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు.
నిందితుడి వేటలో సుమారు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రస్తుతం థానేలో చిక్కిన నిందితుడి విచారణ సాగుతోంది.ఆదివారం మధ్యాహ్నం బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచనున్నారని తెలిపారు. పోలీసు సిబ్బందిలో ఒక అధికారి జాతీయ మీడియాకు ఇచ్చిన వివరాల ప్రకారం....అవును నేనే ఈ నేరం చేసానని అతడు అంగీకరించినట్టు తెలిసింది. ఈరోజు అరెస్టయిన వ్యక్తి విజయ్ దాస్ బంగ్లాదేశ్ జాతీయుడని పేర్కొన్నారు. అతడికి బిజోయ్ దాస్, మొహమ్మద్ ఇలియాస్, బిజె అనే ఇతర పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో ఐడీలు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అయితే వారు అతడిని మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ (30) గా గుర్తించారు. ఇది అతడి అసలు పేరు. అతడు తన బంగ్లాదేశ్ మూలాలను దాచడానికి భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు.
మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ బాలీవుడ్ నటుడు సైఫ్ ఖాన్ పై దాడి అనంతరం ఎప్పటికప్పుడు తాను ఉండే చోటును మార్చాడు. సిసిటివి కెమెరాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. దాదర్, వర్లి ప్రాంతాలలో అతడు దాక్కున్నాడు. దాడి జరిగిన దాదాపు 70 గంటల తర్వాత దట్టమైన మడ అడవులలో దాక్కున్న సమయంలో అతడు థానేలోని ఘోడ్‌బందర్ ప్రాంతానికి వచ్చి అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. తనను ఎవరో వెంబడిస్తున్నారని, తనకు దగ్గరగా ఎవరో ఉన్నారని గ్రహించి మొహమ్మద్ భయపడిపోయాడని.. కానీ చివరికి విధి నిర్ణయమైందని, అతడు పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుడిని ముంబై ఖార్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారిస్తున్నారు.
ఇద్దరు అనుమానితులపై పోలీస్ వేట :
అయితే సైఫ్ పై దాడి కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు ఛేజ్ చేసారు. థానేలో పట్టుబడిన వ్యక్తి విజయ్ దాస్ కాగా, దుర్గ్‌కు చెందిన ఆకాష్ కనోజీని దుర్గ్‌లోని ఆర్‌పిఎఫ్ పోలీసులు విచారించారు. అయితే కనోజీ నిర్ధోషి. అతడిని పోలీసులు విడిచిపెట్టారు. అతడు విడుదలైన అనంతరం.. తాను నిందితుడిని కాదని, ఎటువంటి నేరం చేయలేదని మీడియాతో పేర్కొన్నాడు. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ఇక్కడికి విచారణ కోసం తీసుకువచ్చారని చెప్పాడు. పోలీసులు కూడా అతడిని అనుమానితుడుగానే పేర్కొన్నారు. ప్రస్తుతం థానేలో దొరికిన విజయ్ దాస్ అలియాస్ మొహమ్మద్ ఇస్లాం అసలు నిందితుడు. ఈ విషయాన్ని అతడు అంగీకరించినట్టు పోలీసులు చెబుతున్నారు.