Begin typing your search above and press return to search.

కొత్త సంవత్సరంలో జరగబోయే కీలక మార్పులివే!

తేదీ మారింది.. దీంతో పాటే క్యాలెండర్‌ మారిపోయింది. పాత సంవత్సరం కనుమరుగై కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను మోసుకుంటూ మన ముందుకొచ్చింది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 10:07 AM GMT
కొత్త సంవత్సరంలో జరగబోయే కీలక మార్పులివే!
X

తేదీ మారింది.. దీంతో పాటే క్యాలెండర్‌ మారిపోయింది. పాత సంవత్సరం కనుమరుగై కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను మోసుకుంటూ మన ముందుకొచ్చింది. అలాగే జనవరి 1, 2024లో ఎన్నో కొత్త మార్పులు రానున్నాయి. ఈ ప్రధాన మార్పులను గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో.. కొత్త మార్పులపై ఒక లుక్కేద్దాం..

కార్లంటే ఇష్టం లేనిదెవరికి.. ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిల్లో కారును సొంతం చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో కార్ల ధరలు, వాటి వేరియంట్, మైలేజీ.. ఇలా ఎన్నో అంశాలను తెలుసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలు చేదు వార్తను వినిపించాయి. జనవరి 1 నుంచి తమ ధరలను పెంచుతున్నామని పలు కార్ల కంపెనీలు ప్రకటించాయి. వీటిలో

టాటా మోటార్స్, మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా వంటి పేరున్న కంపెనీలు ఉన్నాయి. తయారీ వ్యయం, అధిక ఇన్‌ ఫుట్‌ ధరల కారణంగానే ధరలు పెంచాల్సి వస్తోందని వెల్లడించాయి. ధరల పెంపు 2 నుంచి 3 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది. కొన్ని మోడళ్లకు ఇంకా ఎక్కువే ధరే పెట్టాల్సి రావచ్చని సమాచారం.

ఆన్‌ లైన్‌ పేమెంట్‌ గేట్‌ వేలు.. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే తదితరాల గురించి తెలియనివారు లేరు. గ్రామాల్లో ఉండే బడ్డీ కొట్టుల నుంచి నగరాల్లో మల్టీఫ్లెక్సుల వరకు చెల్లింపులు అంతా గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటివాటితోనే జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒక ఏడాది కాలంగా వినియోగించని యూపీఐ ఖాతాలు డీయాక్టివేట్‌ కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గత ఏడాది కాలంగా వినియోగించని యూపీఐ ఐడీలు ఏమైనా ఉంటే కొత్త ఏడాది జనవరి 1 నుంచి డీయాక్టివేట్‌ అవుతాయి. యూపీఐ ఖాతాను ఒక సంవత్సరం పాటు ఉపయోగించకుంటే, ఇక నుంచి అది పనిచేయదు. దీని గురించి ఇప్పటికే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఒక ప్రకటన జారీ చేసింది. లావాదేవీలు నిర్వహించని వినియోగదారుల ఫోన్‌ నంబర్లతో మోసాలు జరగకుండా నిరోధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కావాలంటే ఆ ఖాతాలను యాక్టివేట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

కరోనా వచ్చాక ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేవారు ఎక్కువై పోయారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీదారుల కోసం ఈ ఏడాది జనవరి 1 నుంచి రివైజ్డ్‌ కస్టమర్‌ ఇన్ఫర్మేషన్‌ షీట్‌ (సీఐఎస్‌) లను విడుదల చేయాలని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా... ఇన్సూరెన్స్‌ సంస్థలను ఆదేశించింది. కస్టమర్లు పాలసీలోని ముఖ్య విషయాలను సులభంగా అర్థం చేసుకోవాలంటే సీఐఎస్‌ లను విడుదల చేయాల్సిందేనని తెలిపింది. అంతేకాకుండా వాటిని సులభమైన భాషలో ఉండేలా చూసుకోవాలని సూచించింది.

ఇప్పటివరకు కొత్త సిమ్‌ కార్డు కావాలంటే ఆధార్‌ కార్డు ఇవ్వాల్సిందే. అయితే ఇక ఫిజికల్‌ గా ఆధార్‌ కార్డును ఇచ్చే అవసరం లేకుండా డిజిటల్‌ కేవైసీని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర టెలికమ్యూనికేషన్స్‌ విభాగం ఆదేశాలు జారీ చేసింది. సిమ్‌ కార్డుల కోసం ప్రస్తుతం ఫిజికల్‌ వెరిఫికేషన్‌ ను తొలగించాలని ఆదేశించింది. డిజిటల్‌ విధానంలో కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. సిమ్‌ కార్డ్‌ మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.