చంద్రబాబుకు తలపోటుగా కీలక నియోజకవర్గం!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు... టీడీపీ అధినేత చంద్రబాబు.
By: Tupaki Desk | 27 Aug 2023 4:53 PM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు... టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే ఓవైపు నారా లోకేశ్ పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు చంద్రబాబు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న చంద్రబాబు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పెడన సీటు ఆయనకు పెద్ద పీటముడిగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.
అందులోనూ పెడనలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వైసీపీ తరఫున జోగి రమేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జగన్ ప్రభుత్వంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ లపైన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిలో జోగి రమేశ్ ఒకరు. ఈ వ్యాఖ్యల ఫలితంగానే ఆయనకు అసలు మంత్రి పదవి వచ్చిందనేవారూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జోగి రమేశ్ ను ఓడించి ఆయనకు షాక్ ఇవ్వాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం పెడన నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాగిత వెంకట్రావు కుమారుడే కృష్ణప్రసాద్. కాగిత వెంకట్రావు కన్నుమూయడంతో కృష్ణప్రసాద్ పెడన టీడీపీ ఇంచార్జి బాధ్యతలు చేపట్టారు.
మరోవైపు పెడన సీటును మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కూడా ఆశిస్తున్నారు. ఈయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందినవారు. పెడనలో కాపుల ఓట్లు 40 వేలకు పైగా ఉన్నాయి. టీడీపీ ఇంచార్జి కాగిత కృష్ణప్రసాద్, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ గౌడ సామాజికవర్గానికి చెందినవారు. గౌడల ఓట్లు కూడా పెడన నియోజకవర్గంలో 35 వేల వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెడనలో వివిధ పార్టీల తరఫున పోటీ చేసేవారిలో కాపు, గౌడ అభ్యర్థులే ఉంటున్నారు.
కాగా మల్లేశ్వరం నియోజకవర్గం రద్దయి 2009లో పెడన నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ తరఫున జోగి రమేశ్ విజయం సాధించారు. 2014లో బూరగడ్డ వేదవ్యాస్ వైసీపీలోకి రావడంతో ఆయనకు జగన్ సీటు ఇచ్చారు. జోగి రమేశ్ ను మైలవరం నుంచి బరిలో దించారు. అయితే పెడనలో బూరగడ్డ, మైలవరంలో జోగి ఇద్దరూ ఓడిపోయారు. ఇంతలో బూరగడ్డ వేదవ్యాస్ వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) చైర్మన్ గా పదవి దక్కించుకున్నారు. దీంతో 2019లో జోగి రమేశ్ పెడన నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
వచ్చే ఎన్నికల్లోనూ పెడన నుంచి వైసీపీ అభ్యర్థిగా జోగి రమేశ్ పోటీ చేసే చాన్సు ఉంది. మరోవైపు టీడీపీ తరఫున పెడన నుంచి పోటీ చేసేది తానేనంటూ బూరగడ్డ వేదవ్యాస్ తాజాగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతం పెడన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న కాగిత కృష్ణప్రసాద్ తనకే సీటు లభిస్తుందని చెబుతున్నారు.
మరోవైపు పెడనలో జనసేన కూడా బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి 25 వేలకు పైగా ఓట్లు సాధించారు. టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే జనసేన కూడా ఈ సీటును ఆశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెడన సీటును చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.